ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఎంతో ప్రచారం చేసిన ‘సూపర్ సిక్స్’ పథకాలు (Super Six schemes) ‘సూపర్ ఫ్లాప్’ అయ్యాయని వాస్తవానికి ప్రజలను మోసం చేయడానికే వాడుకబడ్డాయని ఆమె ఆరోపించారు. ఏడాది పాలన గడిచినా ఒక్క హామీ సక్రమంగా అమలు కాలేదని మండిపడ్డారు.
ఉద్యోగాల హామీ: ఎక్కడికి పోయింది?
షర్మిల (YS Sharmila) ప్రశ్నిస్తూ… “20 లక్షల ఉద్యోగాలు (20 lakh jobs) ఇస్తామన్న చంద్రబాబు గారు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇచ్చారా?” అని నిలదీశారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి కూడా అందలేదని విమర్శించారు. ఈ విధంగా యువతకు చేసిన హామీ పూర్తిగా ఖాళీ మాటగా మిగిలిందని వ్యాఖ్యానించారు.
మహిళల పథకం: వాగ్దానం విఫలం
మహిళల సంక్షేమం పేరుతో ప్రకటించిన మహిళకైనా నెలకు రూ.15 వందలు అకౌంట్ లో పడ్డాయా? “18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా ఇప్పటివరకు ఈ డబ్బు అందిందా?” అని ప్రశ్నించారు. ఇంతటి పెద్ద వాగ్దానం చేసి అమలు చేయకపోవడం ఘోర మోసమని అన్నారు.
రైతు సంక్షేమం: మాట తప్పిన ప్రభుత్వం
‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని కూడా షర్మిల (YS Sharmila) ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రైతులకు రూ.20 వేల సహాయం ఇస్తామని ప్రకటించి, చివరికి కేంద్రం ఇస్తున్న రూ.6 వేల సాయంతో కలిపి చూపించిందని మండిపడ్డారు. దీంతో 30 లక్షల మంది రైతులు లబ్ధి కోల్పోయారని ఆమె ఆరోపించారు.
పిల్లలు, గ్యాస్ సిలిండర్లు – హామీలు నెరవేరలేదని ఆరోపణ
‘తల్లికి వందనం’ పథకం కింద 20 లక్షల మందికి హామీ ఇచ్చి, చివరికి తక్కువ మందికే డబ్బు అందిందని షర్మిల తెలిపారు. అలాగే రూ.15 వేలు ఇస్తామని చెప్పి, రూ.13 వేలకే పరిమితం చేశారని విమర్శించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఎంత మందికి చేరుతున్నాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతుందని ఆమె ఎత్తిచూపారు.
ఫ్రీ బస్సు – ఆలస్యంగా అమలు
ప్రజలకు నిజమైన లబ్ధి అందించే పథకాలు ఆలస్యం చేశారని షర్మిల పేర్కొన్నారు. “14 నెలల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేసి, మిగతా హామీలన్నింటిని నెరవేర్చినట్లు చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు” అని ఆమె దుయ్యబట్టారు.
‘సూపర్ సిక్స్’ సూపర్ ఫ్లాప్ – షర్మిల తేల్చివేత
చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా విఫలమైందని షర్మిల వ్యాఖ్యానించారు. “సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అటకెక్కింది, సుపరిపాలన కొండెక్కింది” అంటూ ఆమె ఘాటుగా విమర్శించారు. ప్రజలకు నమ్మకాన్ని కలిగించాల్సిన చోట మోసం చేశారని తీవ్రంగా దుయ్యబట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: