యువతే జాతి పురోగతికి మూలాధారం. నేటి బాలలు, యువతీయువకులే రేపటి దేశభవిత నిర్ణేతలు. యువజనశక్తియుక్తులే దేశాభివృద్ధికి బాటలంటూ ఉపన్యాసాలిస్తూ, కోట్లాది రూపాయలు వారి సంక్షేమం, అభ్యుదయం కోసం వెచ్చిస్తున్నట్లు ప్రకటిస్తున్నా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు. యువ జనుల్లో రోజురోజుకు నిరుత్సాహం పెరిగిపోతున్నది. నిరక్షరాస్యులైన యువకులే కాదు, ఉన్నత చదువులు అభ్యసిం చిన వారు కూడా నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న యువతీయువకుల పరిస్థితి ఇందకు మినహాయింపు కాకపోయినా దేశ ప్రగతికి పట్టు గొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత (The youth) పరిస్థితి రానురాను అత్యంత దయనీయంగా తయారవుతున్నది. చదివిన చదువులకు తగ్గట్టుగా ఉపాధి దొరక్కపోయినా, జీవించేందుకు అవసరమైన కనీస సంపాదనకు సైతం నోచుకోలేని దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అర్థాకలితో అల్లాడిపోతున్నారు. డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్ చివరకు ఇంజినీరింగ్ంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన విద్యార్థులు సైతం గ్రామాల్లో రోజువారీ వ్యవసాయ కూలీకి వెళ్లలేక, ఒకవేళ పరిస్థితుల ప్రభావంతో వెళ్లినా అలవాటులేని కష్టం చేయలేక దేశంలో కోట్లాది మంది యువతీయువకులు పడుతున్న ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. నగరాలకు చేరుకొని ఒక పూటే తింటూ పోటీ పరీక్షలకు తయారవుతున్న కోట్లాది మంది విద్యార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. పని చేసే శక్తి ఉంది. ఉన్నంతలో కొద్దోగొప్పో మేధాశక్తి ఉంది. కష్టపడి పనిచేయాలనే ఉత్సాహం ఉంది. సంఘంలో తమకు ఒక స్థానం సంపాదించుకోవాలనే తపన ఉంది. అయినా ఏ ఆధారం లేక నిరుత్సాహంగా అర్థాకలితో అసంతృప్తితో అల్లాడిపోతున్నారు. ఏ చిన్న ఆధారం దొరి కినా కష్టపడి పనిచేయడానికి వెనుకాడడం లేదు. ఇకపోతే మెడికల్, ఇంజినీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన యువతీయువకులు నిన్నమొన్నటి వరకు విదేశీ బాటపట్టే వారు. ఇప్పుడు రానురాను అవి కూడా ముగిసిపోతున్నా యి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్బాధ్యతలు రెండోసారి స్వీకరించిన తర్వాత దాదాపు దారులు మూసేశారనే చెప్పొచ్చు. ఇందులో బాగా నష్టపోయింది. పోతున్నది భారతదేశం నుంచి వెళ్లిన, వెళ్తున్నవారేనని చెప్పొచ్చు. వాస్తంగా అక్కడికి వెళ్లి చదువును మరింత పెంచుకొని, జీవనోపాధి సంపాదించాలని మనస్ఫూర్తిగా వారికి లేదు. కేవలం డబ్బు సంపాదన కోసమే అధికశాతం మంది వెళ్తున్నారు. ఇక్కడ ప్రజల డబ్బుతో చదివి, ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాల్సిన యువతరం ఏదోరకంగా విదేశాలకు వెళ్లి తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించు కొని అక్కడి ప్రజలకు సేవలు అందించడానికి ఆరాటపడ డంలో ఉన్న అంతర్థానాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా విదేశాలకు వెళ్తున్నవారిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే అందులో తెలుగురాష్ట్రాలు మొదటి వరుసలో ఉన్నాయని చెప్పొచ్చు. వీరంతా ఒకవేళ ఇక్కడే సేవలు అందిస్తారనుకున్నా వారికి తగిన వసతులు, వేతనాలు చెల్లించడంలో కేంద్రప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా ఏదో ఒక జీవనోపాధి కోసం విదేశీ బాటలు పడుతున్నారు. ఇలా పడుతున్నవారిని మోసం చేసేవారు ఇటీవలకాలంలో పెరి గిపోతున్నారు. లక్షలాది రూపాయలు తలతాకట్టుపెట్టి అప్పుతెచ్చి దళారులకు ఇచ్చి మోసపోయిన నిరుద్యోగులు దేశంలో లక్షల్లోనేఉంటారు. ఇక నిరుద్యోగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. స్వయం ఉపాధి పథకాల కింద కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అధునాతన ప్రపంచంలో కాలాన్ని మించిన వేగంతో శాస్త్రసాంకేతిక రంగాల్లో పురోగమిస్తున్నాయి. ఆధు నిక మానవుడు అపూర్వమైన మేధాశక్తిని సంపాదించుకొని శక్తియుక్తులు ప్రతిభా సామర్థ్యాలతో విశ్వాంతరాలపై సాధిస్తున్న విజయాల వెనుక యువశక్తి పాత్ర అత్యంత కీలక మైందని తెలియనివారు ఎవరూ లేరు. నవ భారత నిర్మా ణానికి ఉద్యమించి దేశకీర్తి ప్రతిషలను ఇనుమడింపవల సిన పవిత్ర బాధ్యత యువజనుల భుజస్కంధాలపై ఉన్నదని సమాజాన్ని ముందుకు నడిపేది, కొత్త మార్గాలకు జాతి వికాసానికి
చేతులు కలిపి దోహదం చేసేది యువ జనులేననేది నిర్వివాదాంశం. ఇలాంటి ఉపన్యాసాలు విం టూనే ఉంటాం. ఆ ఉపన్యాసాలు చేస్తున్న ప్రకటనలు పరిశీలిస్తుంటే దేశంలో యువజన సంక్షేమం ఆశ్చర్యం గొలి పేలా పయనిస్తున్నదని భావిస్తాం. ఇన్నికోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా యువజను (The youth)లఅభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నామని పాలకులు ప్రకటిస్తున్నా ఇంతటి నిరుత్సాహం, నిస్పృహల్లో ఎందుకు యువజనులు మునిగిపోతున్నారనే అనుమానాలు రాకతప్పదు. అటు గ్రామాల్లో యువత, ఇటు నగరాల్లోని యువజనం కుల, మత, వర్గ, బేధాలు లేకుండా అందరిలోనూ ఈ అసంతృప్తులు వ్యక్తమవుతూనే ఉన్నా యి. ఇవి పాలకులకు తెలియవని అంటే నమ్మశక్యంకాదు. అసలు యువజన సంక్షేమం కోసం చేపడుతున్నపథకాలు ఏమేరకు నిజమైన అర్హులకు అందుతున్నాయి? అందులో రాజకీయ జోక్యం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటివి ఎందుకు నిరోధించలేకపోతున్నారు? ఇలాంటికారణాలు ఎన్నో నిజమైన అర్హులకు దూరం చేస్తున్నాయి. అటు ఉద్యోగాలు రాక, స్వయం ఉపాధి పథకాలు కళ్లముందే అనర్హులపాలవుతుంటే నిరాశానిస్పృహలకు లోనవుతూ ఆత్మహత్యలకు కూడా పాల్ప డుతున్నవారు లేకపోలేదు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. యువజనుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి. పాలకుల వైఖరిలో మార్పురావాలి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్దిష్టమైన కాలపరిమితిలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. యువజన సంక్షేమ కార్యక్రమాలు త్రికరణశుద్ధిగా అమలు చేయాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: