కులగణనకు ఆమోదం తెలిపిన కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల కొంతమంది వ్యక్తులు కులగణన వలస కులతత్వతం పెరుగు తుందనే వాదనలను ముందుకు తీసుకువస్తున్నారు. కులగణన కోరు కుంటున్న వారెవ్వరూ కులపునాదు లపై జాతిని నిర్మించాలని కోరుకోవ డం లేదు. 75 సంవత్సరాలుగా కొనసాగుతున్న రెండు మూడు కులాల పాలనా ఆధిపత్యాన్ని నివారించి, సమాజంలో అన్ని వర్గాలకు పాలనతోపాటు ప్రకృతివనరుల పంపిణీలో భాగస్వామ్యం కల్పించాలని కోరుకుంటున్నారు. నిజానికి స్వాతంత్య్రం లభించిన వాటి నుంచి నేటి వరకు అగ్రవర్ణ పునాదులపైనే భారతదేశ పాలన కొనసాగుతోంది. దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా మూడు నాలుగు కులాలే అధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ గుర్తుకురాని కులతత్వం కేవలం కులగణన (Census)చేయడంవల్ల ప్రజలలో కులతత్వం పెరుగుతుందని ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కులగణన చేయడం వల్ల ‘ప్రజాస్వామ్యం పలుచన’ అవుతుందని కొంతమంది మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశ జనాభాలో కనీసం 10 శాతం కూడా లేని మూడు నాలుగు కులాలకు చెందినవారు, 90 శాతం ప్రజలకు అధికారం, వనరులు అందకుండా చేయడం ‘చిక్కనైన ప్రజాస్వామ్యం’ ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. లెజిస్లేచర్ (చట్ట సభలు), కార్యనిర్వాహణ (ఎగ్జిక్యూటీవ్), న్యాయ(జుడిష్య రీ) వ్యవస్థలతో కూడినదే ప్రజాస్వామ్యం మొత్తం 543 లోక్సభ స్థానాలలో బీసీ వర్గాలకు చెందిన లోక్సభ సభ్యు ల సంఖ్య 26శాతం దాటలేదు. 18వ లోక్సభ (ప్రస్తుత)లో ఒబీసీల సంఖ్య 140 నుంచి 145 మంది మాత్రమే ఇక సివిల్ సర్వీసులలో, వివిధ ప్రభుత్వశాఖలలో పనిచేసే ఉన్నత ఉద్యోగాలలో సమాజంలో 52 శాతం (మండల కమిషన్ నివేదిక ప్రకారం) కలిగిన బీసీ కులాల వాటా 20 శాతం మించలేదు. న్యాయవ్యవస్థకు వస్తే భారత దేశంలో వున్న మొత్తం 25 రాష్ట్ర హైకోర్టులలో 2018, జులైనాటికి మొత్తం జడ్జీల సంఖ్య 1125, వీరిలో ఒబీసీల సంఖ్య కేవ లం 93 మంది, ఎస్సీలు 25, ఎసిటి 70 మంది మాత్రమే. ఇక సుప్రీం కోర్టులో పనిచేస్తోన్న మొత్తం జడ్జీల సంఖ్య 34, వీరిలో ఒబీసీ సామాజికవర్గానికి చెందినవారు కేవలంఒకరు మాత్రమే.
Read Also : http://Hyderabad Metro : భద్రత దిశగా కీలక అడుగు.. భద్రతా బృందంలోకి 20 మంది ట్రాన్స్‌జెండర్లు…

కులాల దృష్టి
ఈ విషయాలను ఇటీవల రాజ్యసభలో సిపిఎం సభ్యులు జాన్ బిటాస్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటీవ్, జుడిష్యరీలను మూడు స్తంభా లుగా, మీడియాను నాలుగో స్తంభంగా పేర్కొంటారు. ఇక మీడియా, వాణిజ్య, వ్యాపార,పారిశ్రామిక రంగాలలో బడుగుల వాటా ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కులగణన (Census) వల్ల ప్రజలలో కులాల దృష్టి పెరుగుతుం దని వ్యాసంలో ప్రస్తావించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటివరకు కులమే ప్రధాన పాత్ర వహించడం జగ మెరిగిన సత్యం. వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో కులం తొలి ప్రాధాన్యత. ఆ తర్వాత ప్రాధాన్యం ఆర్థిక వనరులు. వీటికి ఆయా పార్టీలు పెట్టిన ముద్దుపేరు గెలుపు గుర్రాలు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్అసెంబ్లీలో 4 శాతం జనాభా కలిగిన కమ్మ సామాజిక వర్గం నుంచి 36 మంది శాసన సభ్యులు, 5 శాతం వున్న రెడ్డి సామాజిక వర్గం నుంచి 32 మంది, 10 శాతం జనాభా కలిగిన కాపుల నుంచి 18 మంది శాసన సభ్యులు, 0.6 శాతం జనాభా కలిగిన క్షత్రియ సామాజిక వర్గంనుంచి ఏడుగురు, 4 శాతం జనాభా కలిగిన వైశ్య, బ్రాహ్మణ వంటి ఇతర ఒసి కులాల నుంచి 4 శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఎస్సి, ఎస్టీలకు రాజ్యాంగ రక్షణ వుండటం వల్ల వారి జనాభా నిష్పత్తి ప్రకారం 29మంది ఎస్సీలు, ఎడుగురు ఎస్టీ శాసన సభ్యులు వున్నారు. ఇక 52 శాతం జనాభా కలిగిన బీసీ కులాలకు సంబంధించి కేవలం 40 మంది శాసన సభ్యులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమైన రాజకీ య పార్టీలకు తమని లౌకిక పార్టీలని, బీసీల పార్టీలని చెప్పు కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరపున కమ్మేతరులు, వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ తరపు రెడ్డేతరులు, ఒకవేళ జనసేన అధికారంలోకి వస్తే కాపేతర సామాజిక వర్గాలను ముఖ్యమంత్రులు కాగలరా? పాము ఎన్ని మెలికలు తిరిగినా పుట్టలోకి వెళ్లే ఆ సమయంలో సాఫీగానే వెళ్లి నట్టుగా రాజకీయపార్టీ నేతల ఎన్నికలకు ముందు బీసీలకు అత్యంత ప్రాధాన్యత, బీసీలకు ప్రత్యేక బడ్జెట్టు అంటూ కబుర్లు చెప్పినా చివరకు వచ్చే సరికి మొత్తం జనాభాలో 10 శాతం కూడా లేని అధిపత్యాల కులాలదే ఆధిపత్యం అవుతుంది. అందువల్ల కులగణన వల్ల కొత్తగా ప్రజలలో కులాలపై దృష్టిపెరగడం అంటూ ఏమివుండదు.
అధికారం చేజారిపోవడం
స్వాతంత్ర్యం వచ్చి ఏడున్న దశాబ్దాలు దాటుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కుమ్మరి, కమ్మరి, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, మేదర, గంగిరెద్దుల వంటి అత్యంత వెనుకబడిన కులాలు ఇప్పటి వరకు చట్టసభల మెట్టుఎక్కలేదు. బండ, మొండి, కాటి పాల, పెరిక ముక్కుల, దాసరి, బుడబుక్కల, పిచ్చికుంట్ల, పాముల, దమ్మలి, ఉప్పర, గౌడజట్టి, కాకిపడగల, అద్దపు సింగులు, గౌడజెట్టీలు వంటి దాదాపు 96కులాలకు అధికా రం అంటే, ఏమిటో కూడా తెలియదు. ఊరిలో జీవించే ఈకులాల సంగతి ఎలావున్నప్పటికీ సంచారజీవనం, యాచన వృత్తి కలిగిన వారికి ఆధార కార్డులు, బియ్యం కార్డులు కూడ లేకుండా ఊరిబయట గుడిసెలలో జీవిస్తున్నారు. ఇటువంటి వారిని కనీసం పౌరులుగా గుర్తించాలన్న కులగణన చేయ డం అనివార్యం. ఒబిసి కులాల కేటగిరీల డివిజన్కు సంబం ధించి కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ రోహిణి కమి షన్ ఇటువంటి సంచార,విముక్తి కులాల గురించే ప్రధానం నివేదికలో ప్రస్తావించారు. కులగణనతోపాటు ఈ నివేదికను కూడా బహిర్గత పర్చాల్సిన అవసరం వుంది. కులగణన చేపడితే ఒక ప్రతి పది సంవత్సరాలకు కులగణన జరిగితే ఏవో ఘోరాలు జరిగిపోతాయనే భావనకూడా వ్యక్తంచేశారు. ప్రతి పది సంవత్సరాలకు కులగణన జరిగితే తమ జనాభా నిష్పత్తి కంటే అత్యధికంగా అధికారం అనుభవిస్తున్న వర్గాల నుంచి అధికారం చేజారిపోవడం మినహా ఏమీ జరగదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటినుంచి నేటి వరకు ప్రతి 10ఏళ్లకు జనాభాగణనతో పాటు షెడ్యూల్కులాల, షెడ్యూల్ తెగల జనాభా గణన జరుగుతూనే వుంది. వారికి కేటా యించిన సీట్లు వారు పొందడం మినహా అదనంగా ఒక్క స్థానం కూడా పొందడం లేదు. అయినా బడుగువర్గాలకు చెందిన వారు అన్ని సీట్లు మాకే కావాలని కోరడం లేదు, “మేకెంతో మా కంత” అనే నినాదంతో తమ జనాభా నిష్పత్తి ప్రకారం తమకు చట్టసభలలో స్థానాలు కావాలని మాత్ర మే కోరుతున్నారు.

నిధులు నామమాత్రమే
సంక్షేమం పేరిట బడుగులకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్లరూపాయలు వృధాచేస్తోందనే భావనలో అధిపత్య కులాలకు చెందినవారు వుంటారు. బీసీలకు, ఎస్సి, ఎస్టీల సంక్షేమానికి కేటాయించే నిధులు, వనరుల పంపిణీ విషయంలో ఇచ్చేది జానడు.. ప్రచారం మాత్రం మూరెడు అన్నట్టువుంటుంది. అంబానీ, ఆదానీ వంటి పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఇచ్చే లక్షల కోట్ల రాయితీలతో పోల్చుకుంటే బడుగులకు కేటాయించే నిధులు నామమాత్రమే. ఉదాహర ణకి మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధిగ్యారంటీ పథకం కింద దేశవ్యాప్తంగా 27కోట్ల మందికి 2024-25 సంవత్సరానికి 86,000కోట్ల రూపాయలు కేటాయించగా, అదే సంవత్సరంలో ఎక్సైజ్, కస్టమ్స్ వంటి పన్నులకి సంబంధించి ఒక్క అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థలు లక్షా 20వేల కోట్ల రూపాయల మేరకు మినహాయింపులు పొందాయి. అందువల్ల అధికారంతోపాటు బడ్జెట్ కేటాయింపు, వనరుల పంపిణీ జరిగినప్పుడు అది ప్రజాస్వామ్య దేశం అవుతుంది. నిజమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరూ తప్పనసరిగా కులగణనకు మద్దతుపలకాల్సిన అవసరం వుంది.
-అన్నవరపు బ్రహ్మయ్య
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: