తెలుగు రాష్ట్రాలలో వాతావరణం (Weather Alert) తీవ్రంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ప్రజలు వర్షాలు, ఎండలు రెండింటినీ అనుభవిస్తూ భిన్న వాతావరణ పరిస్థితులకు లోనవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకొని వర్షాలు పడుతుండగా, ఇంకొన్ని చోట్ల ఎండలు భగ్గుమంటూ ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.
రుతుపవనాలు, ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు:
వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం దక్షిణ భారతదేశం మీదుగా ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో, దానికి తోడు నైరుతి రుతుపవనాలు సముద్రం వైపు నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రవహించడంతో వర్షాలు కురిసే అవకాశాలు పెరిగినట్లు తెలిపింది. తెలంగాణలో పశ్చిమ, నైరుతి దిక్కుల గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.
తెలంగాణలో వర్షాలు పడే జిల్లాలు:
హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం ప్రకారం, తెలంగాణలో పశ్చిమ మరియు నైరుతి దిక్కుల నుంచి గాలులు వీస్తున్న నేపథ్యంలో ఈ ప్రభావం మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతల స్థితి:
ఇక ఉష్ణోగ్రతల పరంగా చూస్తే, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గరిష్టంగా 38, మహబూబ్ నగర్‌లో కనిష్టంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితి:
అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోనూ రుతుపవనాలు మరియు తక్కువ మేఘల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ సూచించినట్లుగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read also: Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రెండు రోజులు వర్షాలు