విశాఖపట్నం తీరప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. ప్రకృతి ప్రసాదించిన అందమైన బీచ్‌లు ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలు, నగర మురుగునీటితో కలుషితమై మత్స్యకారుల జీవనోపాధిని, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.
పర్యాటక కేంద్రంగా పేరొందిన విశాఖ తీరం ఇప్పుడు కాలుష్య కోరల్లో విలవిలలాడుతోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి బీచ్ వరకు సుమారు 40 ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు, నగర మురుగునీరు నేరుగా సముద్రంలో కలుస్తోంది. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దారుణం వల్ల సముద్రపు నీరు రంగు మారి, దుర్వాసన వెదజల్లుతోంది. తీరానికి సమీపంలో ఉండే చేపల సంతతి గణనీయంగా తగ్గిపోతోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, పాలకులు మారినా తమ కష్టాలు మాత్రం మారడం లేదని వారు వాపోతున్నారు.
TG: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్..
మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (STP) సరిగ్గా పనిచేయకపోవడం లేదా అసలు లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. నగరంలోని ప్రధాన కాలువల ద్వారా వచ్చే చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా అలల తాకిడికి సముద్రంలోకి వెళ్తున్నాయి. కనీసం మురుగు నీటిని శుద్ధి చేయకపోయినా, ఘన వ్యర్థాలు మరియు ప్లాస్టిక్ సముద్రంలోకి వెళ్లకుండా ‘ట్రాష్ ట్రాప్స్’ లేదా ఇనుప జాలీలను ఏర్పాటు చేయాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కాలుష్యం వల్ల సముద్ర తీరంలో వేటాడే చిన్న మత్స్యకారులు ఖాళీ వలలతో వెనుతిరగాల్సి వస్తోంది.
మరోవైపు, ఈ జల కాలుష్యం పర్యాటకులపై కూడా ప్రభావం చూపుతోంది. బీచ్‌కు వచ్చే సందర్శకులు కలుషిత నీటి వల్ల చర్మ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు మరియు ఇతర జీవరాశులు ఈ విషపూరిత వ్యర్థాల వల్ల అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పే పాలకులు, కనీసం తీరాన్ని కాపాడుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు మేల్కొని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.