Vallabhaneni Vamsi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వివాదాస్పద నాయకుడిగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ప్రస్తుతం చట్టపరమైన చిక్కుల్లో కూరుకుపోయారు. గత కొన్ని నెలలుగా ఆయనపై వరుసగా కేసులు నమోదవుతుండడం, పీటీ వారెంట్లు వేయడం, బెయిల్ లభించినా జైలు జీవితం నుంచి విముక్తి కలగకపోవడం ఆయన భవిష్యత్తు రాజకీయాలకు గందరగోళాన్ని కలిగిస్తోంది. వంశీ ప్రస్తుతం విజయవాడ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా కొనసాగుతుండగా, మరోవైపు మరిన్ని కేసులు ఎదురవుతున్నాయి.
నకిలీ ఇళ్ల పట్టాల కేసు మళ్లీ తెరపైకి
2019 ఎన్నికల సమయంలో వంశీపై ఓటర్లను ఆకర్షించేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. అప్పట్లో ఆయన అధికార వైసీపీ (YCP) కి సన్నిహితుడిగా ఉండటం వల్ల పోలీసులు విచారణలో వంశీపై పాత్ర లేదంటూ కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే, కేసును మాత్రం మూసివేయలేదు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తిరిగి టీడీపీలో చేరడంతో పరిస్థితులు మారాయి. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో వంశీ పాత్ర ఉందని నిర్ధారించిన పోలీసులు, తాజాగా ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి బాపులపాడులో హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్‌పై శుక్రవారం విచారణ జరిగి, వంశీని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు-గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీపై, గన్నవరం (Gannavaram) లోని టీడీపీ కార్యాలయంపై దాడి, విధ్వంసం కేసుతో పాటు, ఒక ప్రైవేటు స్థలం ఆక్రమణకు సంబంధించిన వ్యవహారాల్లోనూ పీటీ వారెంట్లు దాఖలయ్యాయి. గన్నవరం స్థల ఆక్రమణ కేసులో హైకోర్టు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేశాయి. టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసుకు సంబంధించి సీఐడీ తరఫున వాదనలు పూర్తికావడంతో, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
స్థల ఆక్రమణ వ్యవహారం
వంశీపై మరో కీలక ఆరోపణ, గన్నవరం ప్రాంతంలో ప్రైవేటు స్థలాన్ని అక్రమంగా ఆక్రమించాడని వచ్చిన కేసు. దీనిపై హైకోర్టులో విచారణ జరిపి, ప్రస్తుతం ఆయనకు ఉపశమనం (బెయిల్) లభించింది. అయినా పీటీ వారెంట్లు కొనసాగుతున్నాయి.
అక్రమ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ నివేదిక
ఇటీవల మరో తీవ్ర ఆరోపణ వంశీపై మట్టితవ్వకాలకు సంబంధించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ చేసిన పరిశీలనలో అక్రమాలు వెల్లడి అయ్యాయి. ఈ నివేదిక ప్రభుత్వానికి సమర్పించగా, మైనింగ్ శాఖతో పాటు ఇతర అధికార శాఖల ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. ఇది మరొక కొత్త కేసుకు దారితీయనుంది. ఈ కేసును ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే జరిగితే వంశీపై మరో కేసు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Read also: K. Anand Rao: ఒక కేసులో బెయిల్ మరో కేసులో అరెస్టైన కాకినాడ రిజిస్ట్రార్ అరెస్ట్