అన్నమయ్య జిల్లా (Tirupati) తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో ప్రసిద్ధిపొందిన శ్రీ పద్మావతీ సమేత ప్రసన్నవేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటరమణ స్వామి ఉత్సవమూర్తులు, గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 09.05 నుండి 09.45 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కాగా, రాత్రి పల్లకీ ఉత్సవం జరుగనుంది.
Read Also: Davos: సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్ అధ్యక్షుడు
ఆలయ సేవలు, పునర్నిర్మాణం, ఉత్సవాలు
ఆలయ నేపథ్యం : ఈ ఆలయాన్ని వెంగీచోళుల కాలంలో ప్రతిష్టించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. శాలివాహన శకం 1400 – 62 సంవత్సరాలలో అచ్యుతదేవరాయల కాలంలో కంభం తిమ్మరాయని వెంకటాద్రి నాయుడు కట్టించారు. ఈ ఆలయ ధూప, దీప నైవేద్యమునకు అమృతకళ గోడు గుబ్బ అనే గ్రామాన్ని సర్వమాన్యం కొరకు ఇచ్చినట్లు శాసనంలో వున్నది. తదుపరి వేంకటాద్రి నాయుడు, వారి కుమారులు వెంకటప్ప నాయుడులు ఆలయానికి మాన్యాలు ఇచ్చారు. శాలివాహన శకం 1465వ సంవత్సరంలో సదాశివరాయులు కూడా భూదానం, సువర్ణదానం ఇచ్చినట్లు దేవాలయ దక్షణదిక్కుగల గోడపై శాసనములలో ఉన్నది. ప్రసన్న వేంకటరమణ స్వామి వారికి అనాదిగా అర్చనాది నిత్య కైంకర్యములను ఏకాయనవేద పాంచరాత్రాగముభగవత్ శాస్త్ర విధానములను, తెంగళ్ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.
అదేవిధంగా తాళ్ళపాక అన్నమాచార్యులు వారు కోసువారిపల్లి ప్రసన్న వేంకటరమణ స్వామిని దర్శించి ముగ్దులై స్వామివారిని కీర్తించినట్లు తామ్ర శాసనము ప్రాకారములకు 75వ, 76వ సంకీర్తనలుగా ఉన్నవి. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన దేవాలయమునకు అనేక భూమాన్యములు కలవు. అదేవిధంగా, స్వామివారి సేవకై దాతలు విరాళంగా భూములను సమర్పించి యున్నారు. తదుపరి కాలంలో శిథిలమైన ప్రాకారములను ధ్వజస్తంభం పునర్మించి వీటితో పాటుగా కళ్యాణ మండపం, ఆలయ గోపురములను నిర్మించి దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో సంప్రోక్షణ నిర్వహించారు. తదుపరి ఏపీ ఎండోమెంట్ శాఖ నుండి జూలై 07, 2010వ తేదీన టిటిడి ఆధీనంలోకి వచ్చింది. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
19.01.2026 ఉదయం – ధ్వజారోహణం (కుంభ లగ్నం) రాత్రి – పల్లకి ఉత్సవం
20.01.2026 ఉదయం – శేష వాహనం రాత్రి – హంస వాహనం
21.01.2026 ఉదయం – ముత్యపుపందిరి వాహనం రాత్రి – సింహ వాహనం
22.01.2026 ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – హనుమంత వాహనం
23.01.2026 ఉదయం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహనం
24.01.2026 ఉదయం – సర్వభూపాల వాహనం రాత్రి – కల్యాణోత్సవం, గరుడ వాహనం (రాత్రి 10.30 గం.లకు)
25.01.2026 ఉదయం – రథోత్సవం రాత్రి – గజ వాహనం
26.01.2026 ఉదయం – పల్లకి ఉత్సవం రాత్రి – అశ్వ వాహనం
27.01.2026 ఉదయం – వసంతోత్సవం, చక్రస్నానం రాత్రి – ధ్వజావరోహణం
జనవరి 24వ తేదీ ఆలయంలో కల్యాణోత్సవం రాత్రి 8 నుండి 10 గంటల వరకు వైభవంగా జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. జనవరి 28న ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఘనంగా జరుగనుంది. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఇ ఒ పి. వరలక్ష్మీ , ఏఇ ఓ గోపినాథ్, ఆలయ ఇస్పెక్టర్ కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: