మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA ) యధావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విబిజిఆర్ఏఎం జి తక్షణం ఆపివేయాలని నినదించారు. ఏఐసీసీ ఆదేశాలతో పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పర్యవేక్షణలో ఆదివారం తిరుపతి(Tirupati)లో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష కార్యక్రమాన్ని కొనసాగించారు.
Read Also: CyberCrime Network:మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ 2005 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం దేశంలోని గ్రామీణ ప్రాంత పేదల ఆర్దిక పరిస్థితి మెరుగు పరచడం, ఉపాధి కల్పన కోసం హక్కుల ఆధారిత చట్టం ఎంజీ ఎన్ఆర్ఈ జీఏ పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు. మహాత్మా గాంధీని దారుణంగా హత్య చేసిన గాడ్సే ఆలోచన విధానంతో నేడు బిజెపి ప్రభుత్వం ఆ మహాత్ముని పేరుపై ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సైతం రూపుమాపాలని ప్రయత్నిస్తోందని తీవ్రంగా విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పేద కుటుంబానికి వేతన ఉపాధిని అందించే ఈ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ నిర్మూలన, వలసలను అరికట్టడానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. ప్రతి సంవత్సరం దాదాపు 6 కోట్ల కుటుంబాలకు ఉపాధిని కల్పించడం సాధ్యమైందని అన్నారు. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దీనిని పూర్తిగా విస్మరించి నిరుద్యోగాన్ని, వలసలను పెంపొందించేలా గ్రామీణ పేదరికం మరింత పెరిగేలా చట్టాన్ని మార్పులు చేసి నేడు అమలకు సిద్ధమైందని మండిపడ్డారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచిన ఎంజిఎన్ఆర్ ఈ జీఏ పథకాన్ని నీరుగార్చి పంచాయతీలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనిని మార్చవద్దని కాంగ్రెస్ పార్టీ సూచించినా తన స్వప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ నిరుపేద ప్రజల కడుపులు కొట్టే చర్యలను వ్యతిరేకిస్తూ దేశవ్యాపిత ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం తన చర్యలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.గత మూడు సంవత్సరాల ఈ పథకానికి కేంద్రం బడ్జెట్ కూడా పెంచలేదన్నారు. హామీతో కూడిన పని, వేతనం జవాబుదారీతనం కొనసాగించాలంటే యూపీఏ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 400 రూపాయలు ఇవ్వాలన్నారు.
Read also: New Plan: మరింత చవక ప్లాన్ తో ఎయిర్ టెల్
కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు బాలగురవం బాబు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా ఎక్కువ పని దినాలను సద్వినియోగం చేసుకున్నది మహిళలే అన్నారు. దాదాపు 365 రోజుల పని దినాలలో 60 శాతం పని దినాలను మహిళలు సద్వినియోగం చేసుకున్న పని హక్కును పొందగలిగారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశానికి పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాలు నేడు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాయని చెప్పారు. పంచాయతీలు తమ ప్రాంతంలో ఏ పనులు చేపట్టాలో ఏది అత్యవసరమో గుర్తించి అందుకు అనుగుణంగా పనులు చేసుకునే అవకాశం నేడు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. పంచాయతీలలో ఏ పని చేయాలో ఈ కొత్త చట్టం ద్వారా కేంద్రమే నిర్ణయిస్తుందని అన్నారు. పర్యవసానంగా గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీలు తమ అధికారాలను కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రం ప్రభుత్వం పంచాయతీలను కూడా నమ్మకుండా తానే పెత్తనం చేయాలని భావించడం అందుకు అనుగుణంగా చట్టాలను మార్చడం హేయమైన చర్యని విమర్శించారు.

మాజీమంత్రి చింతా మోహన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పేదల కడుపులో కొట్టి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు నూతన చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. నరేగా పనులను కేంద్రం కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలన్న సంకల్పంతోనే మార్పులు చేసిందని అన్నారు. ఇకపై పంచాయతీలపై కాంట్రాక్టర్ల పెత్తనం పెరిగిపోతుందని పేదలకు పని హక్కు చట్టబద్ధత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పనులకు పంచాయతీలు ఢిల్లీ వైపు చూడాల్సిన దయనీయ పరిస్థితిని కేంద్రం కల్పించిందని మండిపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మార్పు వల్ల కేంద్ర ప్రభుత్వం దేశంలోని నిరుపేదలను ఆదుకోవాల్సిన పరిస్థితి నుంచి తప్పుకుంటుందని ఆరోపించారు.
పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ గతంలో ఈ పథకం అమలకు కేంద్ర ప్రభుత్వమే వంద శాతం నిధులు కేటాయించేదని నేడు మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల 40 శాతం వ్యయం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడకపోతే ఈ పథకం గాలిలో దీపంగా మారిపోతుందన్నారు. పర్యవసానంగా గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి హామీ లభించదని వలసలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలోను నరేగా పనులు ద్వారా దేశంలో 4.6 కోట్ల మందికి ఉపాధి లభించిందని నేడు అలాంటి పరిస్థితి కనపడదని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు రహదారుల పనులు వేగంగా జరిగాయని దాదాపు పది కోట్ల రూపాయల విలువైన నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. అత్యంత విజయవంతమైన ఈ పథకంను కుట్రపూరితంగా నిరుపయోగం చేసేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్నె ఖాన్, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, కోడూరు నియోజకవర్గం ఇన్చార్జ్ ఊసాల దేవి, రాష్ట్ర ఎస్సీ విభాగం కార్యదర్శులు శాంతయ్య, చిత్తూరు శివశంకర్, రాష్ట్ర కన్వీనర్ బోయన నరేంద్రబాబు, తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆమూరి కృష్ణమూర్తి, కార్యవర్గ సభ్యుడు వాసు, ఎం ఎస్ యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిన్నే మల్లికార్జున, జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, బీసీ విభాగం రాష్ట్ర మాజీ కార్యదర్శి ఐరాల గోపి గౌడ్, ఎస్ టి విభాగం జిల్లా అధ్యక్షుడు స్వరూప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: