ఏపీలో రాజధాని అంశం మరోసారి వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి(Amaravati)పై తీరుగా వైఖరి మార్చుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. శనివారం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
“అందితే జుట్టు, అందకపోతే కాళ్లు” – వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు
వైసీపీ నేతలు అమరావతిని అంగీకరించడంలో చూపుతున్న దౌర్బల్యాన్ని, శ్రావణ్ కుమార్ గట్టిగా ఎత్తిచూపారు.
“రాజధాని అంశంలో వైసీపీ వ్యవహారం ‘అందితే జుట్టు, అందకపోతే కాళ్లు‘ అనే చందంలో ఉంది. ఎన్నికలు రాగానే అమరావతే రాజధాని అంటున్నారు. ఇదంతా ప్రజలను మోసం చేయడానికి చేస్తున్న రాజకీయ డ్రామా,” అని ఆయన ఆరోపించారు.
సజ్జల వ్యాఖ్యలు పై తీవ్ర ఆగ్రహం
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉండాలని చేసిన వ్యాఖ్యలపై, శ్రావణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
“తాడేపల్లి (Tadepalli)గుమస్తాగా పేరుగాంచిన సజ్జలకు ప్రభుత్వ విధానాలపై మాట్లాడే అర్హత ఎక్కడిదీ? ఆయన మాటల వెనుక జగన్ పన్నిన మరో కుట్ర కనిపిస్తోంది,” అని ఆయన విమర్శించారు.
చరిత్రను మరిచిన వైసీపీ?
2014–2019 మధ్య కాలంలో జగన్ అమరావతికి మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేసిన శ్రావణ్ కుమార్, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక జరిగిన మార్పులను బహిర్గతం చేశారు.
“జగన్ స్వయంగా అసెంబ్లీలో 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి మద్దతు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల డ్రామా ఆడారు. అది ఏకంగా జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు అనే పేర్లతో ప్రజల్లో అయోమయం సృష్టించే యత్నం,” అన్నారు.
అమరావతిపై అవమానకర వ్యాఖ్యల చరిత్ర
వైసీపీ నేతలు గతంలో అమరావతిని ఉద్దేశించి చేసిన అవమానకర వ్యాఖ్యలను శ్రావణ్ కుమార్ ఘాటుగా ప్రస్తావించారు.గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు అమరావతిపై చేసిన వ్యాఖ్యలను శ్రావణ్ కుమార్ ప్రస్తావించారు. “అమరావతిని భ్రమరావతి అన్నారు, శ్మశానం అన్నారు, ఎడారి అని హేళన చేశారు. ఒక వ్యక్తి ఇది వేశ్యల రాజధాని అని నీచంగా మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి పనికిరాదని, ముంపు ప్రాంతమని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ దొంగ సర్టిఫికెట్లు సృష్టించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేసి, ఐదేళ్ల పాలనలో ఒక్క ఆధారాన్ని కూడా నిరూపించలేకపోయారు. అమరావతి రైతులపై దాడులు చేయించి, చిత్రహింసలకు గురిచేశారు. ఇన్ని చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అమరావతే రాజధాని అంటారు?” అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు కట్టిన భవనాల మీద ఇప్పుడు ఆశ?
“వైసీపీ నేతలు గతంలో అమరావతిలో భవనాలేవీ లేవని చెప్పారు. కానీ ఇప్పుడు అదే భవనాల్లో పాలన చేయదలిచారు. మీరేమైనా ఒక్క ఇటుక వేసారా?” అని ప్రశ్నించారు.
“రుషికొండకు గుండు కొట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టించుకున్నారు. కానీ ప్రజల రాజధానిని నాశనం చేశారు,” అంటూ మండిపడ్డారు.
నిజమైన చిత్తశుద్ధి ఉంటే.. జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి
తన ప్రసంగాన్ని ముగిస్తూ శ్రావణ్ కుమార్, వైసీపీపై కఠిన డిమాండ్ చేశారు.
“మూడు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించి, మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని జగన్ స్వయంగా ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి. అప్పుడే ప్రజలు మళ్లీ విశ్వసించగలుగుతారు. లేదంటే వైసీపీ మాటలకు ఎవ్వరూ నమ్మకపడరు,” అని స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: