తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలో తన పేరును చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రిపోర్టులో తన పేరును తొలగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పాలనలో స్మితా సబర్వాల్ బాధ్యతలు
బీఆర్ఎస్ పాలనలో స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా, అలాగే నీటిపారుదల శాఖ ఇన్‌చార్జి కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు నిర్ణయాలు, ఫైళ్లలో ఆమె పాత్ర ఉందని ఆ రిపోర్టులో ప్రస్తావన వచ్చింది. గత సంవత్సరం ఆమె పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆరోగ్య కారణాలతో దీర్ఘకాలిక సెలవు
ప్రస్తుతం స్మితా సబర్వాల్ అనారోగ్య కారణాలతో దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఇలాంటి సమయంలో తన పేరు వివాదాస్పద నివేదికలో కొనసాగడం అన్యాయమని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.