ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊతం లభించింది. ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు గాను రూ. 3,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇటీవల ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేంద్ర ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికను వివరించింది. 2027 మార్చి నాటికి తొలి దశ (41.15 మీటర్ల ఎత్తు వరకు) పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.
HYD : హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!
పనుల వేగం తగ్గకుండా ఉండేందుకు తక్షణ ఆర్థిక సాయం అవసరమని రాష్ట్ర అధికారులు కోరగా, కేంద్ర జలశక్తి శాఖ అధికారి కాంతారావు సానుకూలంగా స్పందించారు. ఈ రూ. 3,000 కోట్ల నిధులను రెండు విడతల్లో (ఒక్కో విడతకు రూ. 1,500 కోట్లు) విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిధులు ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ప్రధాన డ్యామ్ పనులు మరియు ఈసీఆర్‌ఎఫ్ (ECRF) డ్యామ్ గ్యాప్-2 పనులకు వినియోగించనున్నారు. కేంద్రం నుంచి అందుతున్న ఈ ముందస్తు నిధులు ప్రాజెక్టు గడువులోగా పూర్తి కావడానికి ఎంతో కీలకం కానున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పోలవరం పనులపై ప్రత్యేక దృష్టి సారించి, అధికారులకు స్పష్టమైన గడువులను విధించారు.
తొలి దశ లక్ష్యం: 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేలా పనులు పూర్తి చేయడం.
ఆర్ & ఆర్ పనులు: నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను కూడా సమాంతరంగా వేగవంతం చేయాలని నిర్ణయించారు.
నీటి విడుదల: 2027 మార్చి నాటికి గ్రావిటీ ద్వారా నీటిని అందించాలనేది ప్రభుత్వ ప్రధాన సంకల్పం. కేంద్రం నుంచి నిధుల ప్రవాహం సాఫీగా సాగితే, దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఈ కల సాకారం కావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.