ఆంధ్రప్రదేశ్‌పై ఉపరితల ఆవర్తన ప్రభావం పెరుగుతోందని, దాని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈరోజు భారీ వర్షాల ముప్పు ఉన్న జిల్లాలు
ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు(Elur), ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
తీరం వెంబడి ఈదురుగాలులు – మత్స్యకారులకు హెచ్చరిక
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశాన్ని పరిగణలోకి తీసుకుని, ఎల్లుండి (రేపటి నుంచి) మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో వర్షాలు: రెండు రోజులపాటు భారీ వర్ష సూచన
తెలంగాణ (Telangana)రాష్ట్రంపై కూడా రుతుపవన ద్రోణి ప్రభావం చూపుతోంది. ఈశాన్య బంగాళాఖాతం నుంచి తూర్పు దిశగా కొనసాగుతున్న ఈ ద్రోణి వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈరోజు వర్షాలు పడే జిల్లాలు
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్,మేడ్చల్ మల్కాజిగిరి ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
రేపటి వర్ష సూచన ఉన్న జిల్లాలు
రేపు కూడా పై జిల్లాలతో పాటు యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో కూడా వర్షాల ముప్పు ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
బలమైన గాలులు వీచే సూచన
ఈ రోజు మరియు రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజల కోసం జాగ్రత్తల సూచనలు
- చెట్ల క్రింద నిలబడకుండా ఉండాలి
- శిథిల భవనాలు, హోర్డింగ్స్ వద్ద రాకుండా చూసుకోవాలి
- ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఈ సూచనలు జారీ చేశారు.
Read hindi news hindi.vaartha.com
Read also