ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) , రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురవనున్నాయి. విజయనగరం, మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
మోస్తరు వర్షాలు కురిసే జిల్లాలు
కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వద్ద నిలబడ వద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు.
భారీ వర్షాల ప్రభావం
అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బూదగవి వంక మరోపారుతోంది. పెంచలపాడు – పొలికి గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలచిపోయాయి. దీనివలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆమిద్యాల గ్రామంలో పిడుగుపాటుకు నరసింహులు అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు మృతి చెందాయి. లక్షన్నర నష్టం వాటిల్లిందని రైతు నరసింహులు వాపోయారు. చాయపురం వద్ద హంద్రీనీవా కాలువ వర్షపు నీటితో నిండిపోయింది. ఇది వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు దారి తీసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మే 20 నుంచి 22 నాటికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది అల్పపీడనంగా మారి, మే 23 నుండి 28 మధ్యలో తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. తుపానుకు “శక్తి” అనే పేరు పెట్టారు. ఇది తూర్పు తీరం మీదుగా ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read also: Andhra Pradesh: టీచర్ల లీప్ యాప్ వార్త పై నిజంలేదు..ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్