అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం
అమరావతి: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి ఐదో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఓ పోక్సో కేసులో బాధితురాలి పేర్లను బయట పెట్టడమే కాకుండా అసభ్యంగా మాట్లాడారు. ఈ మాటల వీడియోలతో సహా వాసిరెడ్డి పద్మ గత నవంబర్‌లో ఫిర్యాదు చేశారు.
ఘోరాలను ప్రశ్నించినందుకే తనపై కేసులు
ఈ నోటీసులను అందుకున్న గోరంట్ల మాధవ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేదని.. ప్రశ్నించిన వారందరిపై అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందని హెచ్చరించారు. తనకు ఈ నోటీసులు ఇప్పుడే ఇచ్చారని.. ఐదో తేదీన విచారణకు వెళ్లడంపై ఆలోచిస్తానన్నారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానని .. వారి సలహా మేరకు నడుచుకంటానన్నారు. విచారణ తేదీ మార్చాలని కూడా అడుగుతానన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని.. రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాలను ప్రశ్నించినందుకే తనపై కేసులు పెడుతున్నరని గోరంట్ల ఆరోపించారు.
జగన్ పిలిచి వైసీపీ టిక్కెట్
కాగా, గోరంట్ల మాధవ్ సీఐగా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనంతపురంలో సీఐగా పని చేస్తున్న సమయంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై చేసిన కొన్ని వ్యాఖ్యలతో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. పోలీసు అధికారుల సంఘం అని చెప్పుకుని ఆయన మీసాలు మెలేసి..తొడలు కొట్టి హైలెట్ అయ్యారు. ఆయన సామాజికవర్గం కూడా కలసి రావడంతో జగన్ పిలిచి వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. వైసీపీ గాలిలో ఎంపీగా గెలిచారు.