రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్(Montha Cyclone) తీవ్ర ప్రభావం చూపుతోంది. కోస్తా ఆంధ్రలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, మొంథా తుపాన్ కొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి క్రమంగా బలహీనపడనుంది. అర్ధరాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో నరసాపూర్ సమీపంలో తీరం దాటిన తుఫాన్ కారణంగా సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు ఎగిసిపడుతుండగా, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
Read Also: Montha Cyclone : కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన తుఫాను
వాతావరణ శాఖ ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, NTR, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. కాకినాడ, గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కొనసాగుతాయని తెలిపింది.
తుఫాన్ ప్రభావంతో పాఠశాలలు, కాలేజీలకు రేపు సెలవు
మొంథా తుఫాన్(Montha Cyclone) ప్రభావం కోనసీమ జిల్లాల్లో తీవ్రంగా ఉంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీరప్రాంతాలు చీకట్లో మునిగిపోయాయి. ప్రభుత్వం అత్యవసర చర్యల భాగంగా ఏపీలోని 19 జిల్లాల్లో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు అమల్లో ఉంటుంది. అదనంగా, నెల్లూరు, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించారు. కాకినాడ జిల్లాలో అక్టోబర్ 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతాయి.
ప్రకాశం, శ్రీశైలంలో వర్ష బీభత్సం
ప్రకాశం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. రాత్రి నుండి కురుస్తున్న వర్షాల వల్ల పలు చెరువులు పొంగిపొర్లాయి. ఒల్లూరు చెరువుకు గండి పడటంతో వరదనీరు NH-16 రహదారిపైకి వచ్చి రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రక్షణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శ్రీశైలంలోనూ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు కాలనీల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీశైలం డ్యామ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రహదారి మూసివేయబడింది. లింగాల గట్టులో మత్స్యకారుల ఇళ్లు నీటమునిగిపోయాయి.
తెలంగాణలో కూడా మొంథా తుఫాన్ పంజా
మొంథా తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైన కూడా గట్టిగానే పడింది. అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాలు నీటమునిగిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. వాతావరణ శాఖ(Meteorological Department) తెలంగాణలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్, తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కోతగూడెం, ఖమ్మం, ములుగు, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జాగ్రత్తలు తప్పనిసరి – వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రజలు అవసరం లేకుండా ఇళ్ల బయటకు రాకుండా ఉండాలని, తీరప్రాంత మత్స్యకారులు సముద్ర యాత్రలను నివారించాలని అధికారులు సూచించారు. తుఫాన్ బీభత్సం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్థానిక అధికారులను సంప్రదించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు విజ్ఞప్తి చేశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: