ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రూ.4,600 కోట్ల భారీ వ్యయంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టులు “ఇండియా సెమీకండక్టర్ మిషన్”లో భాగంగా అమలు చేయనున్నారు. దేశంలో అత్యాధునిక చిప్ తయారీ, ప్యాకేజింగ్, టెస్టింగ్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడం, సాంకేతిక స్వావలంబన పెంపొందించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం ప్రకటించింది.అయితే, ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ స్థాయి అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, అన్ని రకాల అనుమతులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్య కార్మికులు, భూమి కేటాయింపు వంటి అంశాలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
ఒక్క ఎకరం భూమి కూడా కేటాయించని
ఈ నేపథ్యంలో తెలంగాణను పక్కనబెట్టి, కనీసం భూమి కేటాయింపులో కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు లేని ఆంధ్రప్రదేశ్‌కు ఈ ప్రాజెక్టు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ వివక్షతకు నిదర్శనమని విమర్శించారు.అన్ని రకాల అనుమతులు, మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నా.. తెలంగాణను కాదని కనీసం ఒక్క ఎకరం భూమి కూడా కేటాయించని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ఈ ప్రాజెక్టును కేటాయించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.తెలంగాణలో సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్ కోసం హైదరాబాద్ శివారు మహేశ్వరంలో 10 ఎకరాల విలువైన భూమిని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిందన్నారు. అన్ని రకాల సబ్సిడీలను, అనుమతులను రికార్డు సమయంలో పూర్తి చేసిందన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పెట్టుబడికి సంస్థ సిద్ధంగా ఉందని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) నుంచి అనుమతి కోసం మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఎదురుచూస్తోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం మెుండిచేయి చూపిందన్నారు
తెలంగాణలో సిద్ధంగా ఉన్న భూమి, అనుమతులు, పెట్టుబడిదారుల హామీలు, స్పష్టమైన అమలు ప్రణాళిక ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మెుండిచేయి చూపిందన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పరిపాలనా లోపం కాదని..తెలంగాణ పట్ల కావాలని చూపిస్తున్న సవతి తల్లి ప్రేమ అని ఆయన ఆరోపించారు. సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారుల హామీలు, స్పష్టమైన ప్రణాళిక ఉన్న ఒక రాష్ట్రాన్ని పక్కన పెట్టి.. కేవలం కాగితాలపై ఉన్న ఒక ప్రతిపాదనకు ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు గ్లోబల్ ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు పంపుతాయని, ఇది తెలంగాణను అవమానించడమేనని అన్నారు. జాతీయ సెమీకండక్టర్ వృద్ధిలో తమకు రావాల్సిన స్థానాన్ని కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
శ్రీధర్ బాబు ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు?
శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు.
శ్రీధర్ బాబు ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు?
ఆయన మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: