ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(MGNREGS) అమలులో పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న మస్టర్ విధానానికి స్వస్తి పలికి, సోమవారం (మార్చి 2) నుంచి కొత్త ‘ఫేషియల్ రికగ్నిషన్’ అటెండెన్స్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమల్లోకి వచ్చిన ఈ విధానం ద్వారా పనికి రాకుండానే వేతనం పొందే అక్రమాలకు పూర్తిగా చెక్ పడనుంది.
Read Also: Shadnagar Raikal Lake: హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు
తప్పనిసరిగా ఈకేవైసీ (e-KYC)
ఈ కొత్త నిబంధన ప్రకారం కూలీలందరూ తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. గతంలో ఒకరి జాబ్ కార్డుపై మరొకరు పనికి వెళ్లడం లేదా అక్రమంగా హాజరు వేయించుకోవడం వంటి ఫిర్యాదులు వచ్చేవి. ఇకపై కూలీలు పని ప్రదేశానికి వెళ్లినప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు వారి ముఖాన్ని స్కాన్ చేసి హాజరు నమోదు చేస్తారు. ముఖ హాజరు నమోదు కాని పక్షంలో వేతనాలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
వేగంగా వేతనాలు.. పెరిగిన పని దినాలు
కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో కేవలం హాజరు విధానమే కాకుండా మరికొన్ని విప్లవాత్మక మార్పులు చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే పని కల్పించడం, పని పూర్తయిన 15 రోజుల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయడం వంటి సౌకర్యాలను కల్పిస్తోంది. దీనికి తోడు పని దినాలను మరియు రోజువారీ వేతనాలను కూడా పెంచడం ద్వారా కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది.
సిగ్నల్ ఇబ్బందులపై ప్రత్యామ్నాయ మార్గాలు
కొన్ని మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఉండటంతో ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేయడం క్లిష్టంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లకు కీలక సూచనలు చేశారు. పని ప్రదేశంలో కూలీల ఫోటోలు తీసుకుని, సిగ్నల్ అందుబాటులో ఉన్న ప్రాంతానికి వెళ్లిన తర్వాత వాటిని యాప్‌లో అప్‌లోడ్ చేసే వెసులుబాటు కల్పించారు. ప్రతి కూలీకి ఒక ప్రత్యేక ఐడీని కేటాయించడం ద్వారా ఈ ప్రక్రియను మరింత సరళతరం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: