ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి నేతల ఆగడాలను పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి తిప్పికొట్టాలని, ప్రస్తుత పాలనలో తప్పులు చేస్తున్న అధికారులు మరియు నాయకులు భవిష్యత్తులో కచ్చితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
HYD: మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా లొంగుబాటు.. పార్టీకి గట్టి షాక్
అనంతపురం జిల్లా యల్లనూరులో జరిగిన దారుణ ఘటనపై జగన్ తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యుడు విజయప్రతాప్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని ఆయన ఆరోపించారు. విజయప్రతాప్ తండ్రి నారాయణ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన జగన్, వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన విజయప్రతాప్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తాము చూస్తూ ఊరుకోబోమని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అక్రమ కేసులతో తమ గొంతు నొక్కలేరని, బాధితుల పక్షాన పోరాడేందుకు చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పోలీసులు తమ వృత్తిధర్మాన్ని విస్మరించి అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజలందరూ గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజలే ఈ అరాచక పాలనకు బుద్ధి చెబుతారని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com