తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు మరోసారి రగిలిపోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) కి తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంపై స్థానిక టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పెద్దారెడ్డి రాకను తాను అడ్డుకోవడం లేదని, కానీ గతంలో ఆయన అక్రమాలకు, దౌర్జన్యాలకు బలైన బాధితులే వ్యతిరేకిస్తున్నారని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలీసులను అడ్డం
ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెద్దారెడ్డి అధికారం అడ్డం పెట్టుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, “మహిళలని కూడా విడిచి పెట్టని పెద్దారెడ్డి, టీడీపీకి చెందిన మహిళా కౌన్సిలర్లను వెంటాడి మరీ దాడి చేశాడు. తన రాజకీయ ప్రతాపం చూపించడానికి పోలీసులను అడ్డం పెట్టుకున్నాడు. ఎంతోమంది టీడీపీ కార్యకర్తలపై పీడీ యాక్ట్ కింద అక్రమ కేసులు నమోదు చేయించి, జిల్లా నుంచి బహిష్కరించాడు” అని విమర్శించారు.జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy), పెద్దారెడ్డి కుటుంబానికి తాడిపత్రిలో రాజకీయాలు చేసే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు నష్టం చేసిన వ్యక్తి తిరిగి వచ్చి రాజకీయాలు చేయడం సమాజానికి మేలు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
పొట్టి రవి ఉదాహరణ
జేసీ ప్రభాకర్ రెడ్డి గతాన్ని గుర్తుచేస్తూ, టీడీపీ సీనియర్ నేత పొట్టి రవికి రాష్ట్రపతి నుంచి అనుమతి ఉన్నప్పటికీ, ఆ సమయంలో తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వలేదని తెలిపారు. “ఆ సమయంలో పొట్టి రవిని అడ్డుకున్నవారే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును చూపిస్తూ పెద్దారెడ్డి ప్రవేశాన్ని న్యాయబద్ధం చేయాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు. తాడిపత్రిలో రాజకీయాలు చేసే నైతిక అర్హత పెద్దారెడ్డి కుటుంబానికి లేదని ఆయన అన్నారు.మరోవైపు, తాడిపత్రిలోకి ప్రవేశించకుండా తనపై ఉన్న ఆంక్షలను సవాలు చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం, ఆయన తాడిపత్రి వెళ్లేందుకు శుక్రవారం అనుమతి ఇచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పు
పెద్దారెడ్డిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేసిన కోర్టు, అవసరమైతే ప్రైవేట్ భద్రతను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని స్థానిక పోలీసులను ఆదేశించింది.సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే తాడిపత్రికి వెళతానని తెలిపారు. కోర్టు తీర్పు కాపీలను ఎస్పీకి అందజేసి, నిబంధనల మేరకు పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: