సాధారణంగా ప్రాంతీయ భాషా సదస్సులు ఆయా రాష్ట్రాలకే పరిమితం కావడం మనం చూస్తుంటాం. కానీ, తమిళసాహిత్య సదస్సుకు తన కార్యక్షేత్రంగా ఢిల్లీని ఎంచుకోవడం వెనుక ఒక బలమైన సాంస్కృతిక స్పృహ ఉంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని భారతీయ భాషలు సాహిత్య అధ్యయన శాఖలో జరిగిన ఈ మేధోమధనం, వివిధ భాషల విద్యావేత్తలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా, తమిళ సాహిత్యం కేవలం తమి ళుల సొత్తు మాత్రమే కాదు, అది భారతీయ విజ్ఞాన సర్వ స్వంలో భాగమని నిరూపించింది. ఇది ఇతర భాషా సంస్థ లకు ఒక మేలుకొలుపు. తెలుగు భాషకు వెయ్యేళ్ల లిఖిత చరిత్ర ఉంది, రెండు వేల ఏళ్ల మౌఖిక చరిత్ర ఉంది. రాజ రాజనరేంద్రుడి ఆస్థానం నుండి, శ్రీకృష్ణదేవరాయల భువన విజయం వరకు మన సాహితీ వైభవం దేదీప్యమానం అని, మన భాష గొప్పదని మనలో మనం చెప్పుకోవడం వేరు, అది ఇతరుల చేత, ముఖ్యంగా భిన్న సంస్కృతుల వారి చేత గుర్తింపు పొందేలా చేయడం వేరు. ఈ విషయంలో తమిళులు చూపిన చొరవ అభినందనీయం. భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదు, అది ఒక జాతి అస్తిత్వ పతాకం. కానీ ఆ పతాకాన్ని మనం ఎగరేస్తు న్నామా? ఢిల్లీలో జరిగిన తమిళ సాహిత్య సదస్సును గమ నించినప్పుడు, మన తెలుగు వారి స్తబ్దత ప్రస్ఫుటంగా కనిపి స్తోంది. ఈ అంతరాన్నిఅర్థంచేసుకోవడానికి ఒక చిన్న పరిశీలన అవసరం.
Read Also: http://Central Govt: స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్రం
సాఫ్ట్ పవర్
ఒక జాతి మనుగడ కేవలం దాని భౌగో ళిక సరిహద్దుల మీదో, ఆర్థిక వనరుల మీదో ఆధారపడి ఉండదు. ఆ జాతి తన భాషను, సంస్కృతిని, విజ్ఞానాన్ని ఇతరులకు ఎంత సమర్థవంతంగా పంచగలుగుతుందనే అంశంపైనే దాని అంతర్జాతీయ గుర్తింపు ఆధారపడి ఉం టుంది. దీనినే ఆధునిక పరిభాషలో సాఫ్ట్ పవర్ అంటారు. డిసెంబరు 4, 5, 6, 2025న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక కార్యశాల, తెలుగు భాషకు ఒక పాఠంగా మారుతుందనిపించింది. చెన్నైకి చెందిన సెంట్రల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్, ప్రతిష్టాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయపు భారతీయ భాషలు (language), సాహిత్య అధ్యయన శాఖ సంయుక్తంగా నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ కార్యశాల, కేవలం ఒకసాహిత్య సమావేశం మాత్రమే కాదు, అది తమిళ భాష (language)తన ప్రాచీనతను ఆధునిక ప్రపంచానికి చాటిచెప్పిన ఒక వ్యూహాత్మక సాంస్కృతిక విజయం. 12వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత కవయిత్రి అవ్వైయార్ రచించి న ఆత్తిచూడి అనే నీతినిధులసంకలనాన్ని ఎంచుకోవడం వెనుక గొప్ప దూరదృష్టి కనిపిస్తుంది. ఇది వేల పద్యాలున్న బృహధ్రంథం కాదు, కేవలం 109 చిన్నచిన్న నీతి వాక్యాల సమాహారం. ఈ చిన్న పుస్తకాన్ని ఒకేసారి వివిధ భాషల్లోకి అనువదించే బృహత్తర బాధ్యతను తలకెత్తుకుంది. ఇందులో భారత రాజ్యాంగం గుర్తించిన భాషలతో పాటు, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషలు, అనేక గిరిజన, మైనారిటీ భాషలు ఉండటం గమనార్హం. కేవలం మూడు రోజుల్లో, 109 వాక్యాలను 60 భాషల్లోకి అనువదించడం, సరిచూడటం, ప్రచురణకు సిద్ధం చేయడం అనేది సాధారణ విషయం కాదు. దీనికి అకడమిక్ డిసిప్లిన్, పక డ్బందీ ప్రణాళిక అవసరం. ఒక పదం మూలార్థం చెడిపోకుండా, లక్ష్య భాషలోని సాంస్కృతిక నేపథ్యానికి అన్వ యించేలా అనువాదం సాగాలి. అక్కడజరిగిన చర్చలు, నిపుణుల సూచనలు, సలహాలు ఈ అనువాద సమస్యల పరిష్కార దిశగా సాగాయి. ఈ 60 పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్తాయి.
తెలుగుభాష పరిస్థితి ఏమిటి?
మనం కేవలం ఈ ఒక్క సంఘటనను చూసి ఆశ్చ ర్యపోతే సరిపోదు. దీనివెనుక ఉన్న వ్యవస్థాగత నిర్మా ణాన్ని అర్థం చేసుకోవాలి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ వెబ్సైట్ను కానీ, వారి నివేదికలను కానీ పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. వారి జాలగూడు (వెబ్సైట్)లో వారిసంస్థ సమా చారం మొత్తం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధు లను కేవలం జీతభత్యాలకో, భవనానికో పరిమితం చేయ కుండా, ఇటువంటి సృజనాత్మక ప్రాజెక్టుల వైపుకు మళ్ళిం చడం వారి విజయ రహస్యం. తిరుక్కురల్ను ఇప్పటికే ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధానభాషల్లోకి అనువదించారు. ఇప్పుడు ఆత్తిచూడి వంతు. వారు కేవలం తమిళ నాడుకే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయి విశ్వ విద్యాలయాలలోవివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో విజయంసాధించారు. ఇక్కడే మనసును కలిచి వేసే ప్రశ్న ఉదయిస్తుంది. తమిళ సోదరులు ఢిల్లీ నడిబొడ్డున తమ భాషా వైభవాన్ని చాటుతుంటే, మన తెలుగుభాష పరిస్థితి ఏమిటి? మనకు కూడా 2008లోనే ప్రాచీన భాష హోదా లభించింది. మనకు కూడా ఒక క్లాసికల్ తెలుగుసంస్థ ఉంది. కానీ, జాతీయ స్థాయిలో దాని ప్రభావం ఎంత? మన తెలుగు సంస్థ నిర్వహించే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే చూడటానికి బాగున్న ఒక మంచి సమావేశ మందిరం, కొంతమంది ఆస్థాన పండితులు. ఈ పండితుల జాబితా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. (మ్యూజికల్ చైర్స్ ఆటలాగా, వాళ్ళే తిప్పి తిప్పి కూర్చుంటారు). సదస్సు అం శాలు, కవి సమ్మేళనం, సాహిత్యం సమాలోచన, సాహిత్యం సమాజం,తెలుగు భాష ఇలా ఏమాత్రం కొత్తదనం లేని అంశాలు, ఎత్తిపోతల పథకాలను ఎంచుకుంటారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీబిస్కెట్లు. మధ్యలో ఒకరినొకరు మీరుమహాకవి అంటే కాదు, మీరే యుగకర్త అని పొగుడుకుంటూ, శాలువాలు కప్పుకుంటూ, ఫోటోలు దిగడంతో సభ ముగుస్తుంది. మరుసటి రోజు పత్రికలో ఒక చిన్న వార్త ఘనంగా తెలుగుసదస్సు అంతే! ఆ సదస్సు వల్ల భాషకు, సాహిత్యానికి, లేదా సమాజానికి ఒరిగిన ప్రయోజనం ఏమిటంటే? సమాధానం శూన్యం.
తెలుగు సంస్థ మేల్కొనాలి
తమిళులు వారి ప్రాచీన సాహిత్యాన్ని వివిధ భాషల్లోకి అనువదించి అంతర్జాతీయ పాఠకులకు అందిస్తుంటే, మనవాళ్ళు వచ్చే నెల ఏ అంశం మీద సమావేశం పెడదాం అని చర్చి స్తుంటారు. తమిళ సెంటర్ పనితీరు రాకెట్ వేగంతో ఉంటే, మనం ఎకకడున్నామో బయటి ప్రపంచానికి తెలీదు. వారు పుస్తకాలను ప్రచురిస్తుంటే, మనం కాలయాపన చేస్తున్నాం. వారు ప్రపంచానికి చెబుతుంటే, మనం గోడలకు చెప్పుకుం టున్నాం. నిజంగా చెప్పాలంటే, మన సంస్థరహస్య గూఢ చారి సంస్థలా పనిచేస్తోంది. అంతర్జాలంలో వారి సమాచా రం ఏమీఉండదు. వారు ఏంచేస్తున్నారో ఎవరికీ తెలియదు. బహుశా అదే వారి వ్యూహం ఏమో! ఇది ఎవరినీ నిందిం చడానికి చేస్తున్న విమర్శ కాదు ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యంపై చేస్తున్న ఆవేదన. ఇటీవల కాలంలో తెలుగుకేంద్రం నుండి జాతీయ స్థాయిని ఆకర్షించే నూతన ఆలోచన ఉన్న ఒక్క సదస్సు అయినా జరిగిందా? వేమన పద్యాలు, సుమతీ శతకం, లేదా భరృహరి సుభాషితాలు తెలుగు అనువాదాలు ఆత్తిచూడి కంటే ఏమాత్రం తక్కువకావు. మన ప్రాచీన రచనల్లోని అంశాలు ప్రపంచ స్థాయికి చెందినవి. కానీ, వాటిని వివిధ భాషల్లోకి అనువదించాలనే ఆలోచన మనకెందుకు రాలేదు? మన దగ్గర నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతన వంటి మహాకవులు ఉన్నారు. వారి సాహిత్యాన్ని ఇంగ్లీష్లోకి లేదా హిందీలోకి అనువదించి, పెంగ్విన్ క్లాసిక్స్ లేదా అంత ర్జాతీయ స్థాయి క్లాసిక్స్ వంటి వాటితో కలిసి ప్రచురించే ప్రయత్నంజరిగిందా? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని తరచుగా వింటుంటాం. కానీ ఉన్ననిధులతో, అందు బాటులో ఉన్న సాంకేతికతతో చిన్నచిన్న ప్రాజెక్టులనైనా ఎందుకు చేపట్టలేక పోతున్నాం? ఒకవేళ అటువంటి ప్రాజెక్ట్లు చేసివుంటే కనీసం జాలగూడులో ఎందుకు లభించడంలేదు? కనీసం జాలగూడును కూడా సరిగా నిర్వహించలేని స్థితిలో ఒక సంస్థఉండడం చాలాబాధాకరం. ఇప్పటికైనా మన విధి విధాన నిర్ణేతలు, తెలుగు భాషాభిమానులు, ముఖ్యంగా తెలుగు సంస్థ వార్డు మేల్కొనాలి. నిధులు గురించి సాకులు చెప్పడం మాని, ఉన్న వనరులతో,ఆధునిక ఆలోచనలతో ముందుకు సాగాలి. తమిళులు ఢిల్లీలో చేసిన సాహిత్య యాత్రను ఒక ప్రేరణగా తీసుకోవాలి. మన కవుల రచనలను ప్రపంచ వేదికపై నిలబెట్టాలి. అంతర్జాతీయ యవనికపై తెలుగు జెండా ఎగరడం అంటే కేవలం నాయకుల ప్రసం గాల్లో కాదు పారిస్ లైబ్రరీలోనో, లండన్ బుక్ స్టోర్లోనో మనప్రాచీన తెలుగు రచనల అనువాదం కనిపించినప్పుడు, జర్మన్విద్యార్థి మన పోతనను చదివి తల ఊపినప్పుడు అప్పుడు నిజమైన తెలుగు వెలుగు ప్రసరించినట్లు. ఆ రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం.
-వెంకట రామయ్య గంపా
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: