ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాన్ని రేపిన నకిలీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) జనార్దన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం వెలువడింది. విచారణలో జనార్దన్ రాతపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలంలో, జోగి రమేశ్ ప్రోత్సాహంతోనే తాను నకిలీ మద్యం తయారీలోకి ప్రవేశించానని వెల్లడించినట్లు తెలుస్తోంది. “రాజకీయ పరిచయాన్ని ఉపయోగించుకుని వ్యాపారాన్ని విస్తరించమని, నష్టపోయిన నాకు రూ.3 కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ప్రోత్సహించారు” అని జనార్దన్ పేర్కొన్నట్లు సమాచారం.
Latest News: Jagruti Teachers Federation: నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన కవిత
ఈ వాంగ్మూలంలో మరో కీలక అంశం బయటపడింది. మద్యం తయారీకి ములకలచెరువు ప్రాంతాన్ని ఎంపిక చేయాలని, జయచంద్రారెడ్డి అనే వ్యక్తి సాయంతో ఏర్పాట్లు చేయాలని జోగి రమేశ్ సూచించారంటూ జనార్దన్ పేర్కొన్నాడు. ఈ వాంగ్మూలం ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సాక్ష్యాలను సమీకరించి, రమేశ్‌పై సాక్ష్యాధారాలతో కూడిన కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే నేపథ్యంతో, సిట్ అధికారులు ఇటీవల మాజీ మంత్రిని అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 19మంది అరెస్టయ్యారు. రమేశ్ అరెస్ట్‌తో మొత్తం అరెస్టుల సంఖ్య 20కి చేరింది.
ఇక మరోవైపు, జోగి రమేశ్ తనపై చేస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు. “నా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోంది. జనార్దన్ వాంగ్మూలం పూర్తిగా ఒత్తిడి వల్ల తీసుకున్నది” అని ఆయన పేర్కొన్నారు. తనను సీఎం చంద్రబాబు రాజకీయంగా టార్గెట్ చేశారని ఆరోపిస్తూ, ఇది “దుర్మార్గ పాలనకు నిదర్శనం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు కూడా రమేశ్ అరెస్టుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం బీసీ నేతలపై పగతీర్చుకుంటోందని విమర్శలు గుప్పించాయి. ఇక సిట్ విచారణ కొనసాగుతుండగా, రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని రాజకీయ మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/