Jogeswara Rao: ప్రభుత్వం కేటాయించే ప్రతి రూపాయి ప్రజలకు చేరాలి

Read Time:  1 min
Jogeswara Rao
Jogeswara Rao
FONT SIZE
GET APP

Jogeswara Rao: ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కేటాయిస్తున్న ప్రతి రూపాయిని కూడా ప్రజలకు చేరువ చేయడమే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ప్రధాన లక్ష్యమని కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు స్పష్టం చేశారు.మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావుతో పాటు సభ్యులు మద్దిపాటి వెంకటరాజు, పాశం సునీల్‌కుమార్, వి.వి. సూర్యనారాయణరాజు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, అసిస్టెంట్ సెక్రటరీ భిక్షం, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు.సమావేశంలో తొలుత జిల్లాలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల వివరాలను ఆయా శాఖల అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు.

Read Also: రాహుల్ దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు – గోయల్ కీలక వ్యాఖ్యలు

సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ సంక్షేమ శాఖలు, డీఆర్‌డిఎ, మెప్మా, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు తమ శాఖలకు సంబంధించిన బడ్జెట్ వినియోగంపై సమగ్రంగా వివరించగా, కమిటీ సభ్యులు చర్చించారు.సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ, జిల్లాలో శాఖల వారీగా ఎంత బడ్జెట్ విడుదలైంది, ఎంత మేర ఖర్చు జరిగింది అనే అంశాలపై సమగ్రంగా కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. జిల్లాలో ఏ పథకానికి ఎక్కువ డిమాండ్ ఉందో గుర్తించి, ఆ పథకానికి అధికంగా నిధులు విడుదల అయ్యేలా ఎస్టిమేట్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.జిల్లా స్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ శాసనసభ వరకు చేరుతుందని, దాని ద్వారా జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు మరింత అవకాశం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వివరించారు.

ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై సమగ్ర వివరాలతో బుక్‌లెట్ తయారు చేయడం పట్ల జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించారు. గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులపై సమీక్ష నిర్వహించామని, అధికారులు పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ఖర్చు చేసినట్లు తెలిపారు. సమావేశంలో పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, పాఠశాల భవనాల పరిస్థితి సంతృప్తికరంగా లేదన్న అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం పరిశీలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ప్రతి రూపాయి ఉపయోగపడేలా ఎక్కడ అవసరమో అక్కడే నిధులు ఖర్చు చేయాలని, పథకాల ద్వారా పేదలకు ఎంతమేర లాభం చేకూరుతోందో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

Jogeswara Rao
Jogeswara Rao: Every rupee allocated by the government must reach the people.

కమిటీ సభ్యులు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ బడ్జెట్‌ను కేవలం ఖర్చు చేయడమే కాకుండా, ఆ ఖర్చుతో ప్రజలకు ఎంతమేర మేలు జరుగుతోందో కూడా అధికారులు అధ్యయనం చేయాలని సూచించారు. చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అమలవుతున్న కార్యక్రమాల ద్వారా సమాజానికి వాస్తవ ప్రయోజనం కలగాలన్నారు.

కమిటీ సభ్యులు, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. చేసిన ప్రతి ఖర్చుకు స్పష్టమైన లెక్కలు చూపాల్సి ఉంటుందన్నారు. అన్ని రంగాల్లో అనుభవం కలిగిన సభ్యులతో కూడిన ఈ ఎస్టిమేట్స్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ తప్పిదాలు జరగకుండా పర్యవేక్షణ చేస్తోందని తెలిపారు. హాస్పిటల్స్, పాఠశాల భవనాల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలోని ఆల్తూరుపాడు రిజర్వాయర్‌కు, శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాల కూల్చివేతకు నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. అలాగే అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు.

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా తమ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురవుతోందని, బడ్జెట్ కేటాయింపుల్లో ఉదయగిరికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గండిపాలెం ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించి మెట్టప్రాంత రైతులకు అండగా నిలవాలని, సాగునీటి రంగ అభివృద్ధికి నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డిఆర్వో విజయ్ కుమార్, డిఆర్‌డిఎ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు నాగరాజకుమారి, గంగాభవాని, ఇరిగేషన్ ఎస్ఈ దేశ్‌నాయక్, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, మత్స్య, పశుసంవర్థక శాఖ జేడీలు రమేష్ నాయక్, శాంతి, డీఎంఅండ్ హెచ్‌వో సుజాతతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.