కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన (Janasena) కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న టి.వి. రామారావు (TV Rama Rao)పై పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ, పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సొసైటీల నియామకాల్లో తప్పుడు చర్యలు జరుగుతున్నాయంటూ టి.వి. రామారావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు బహిరంగ ఆందోళన చేపట్టారు. టోల్ గేట్ వద్ద రాస్తారోకో కూడా నిర్వహించారు. జిల్లాలో ఉన్న 14 సొసైటీలలో కనీసం మూడు పదవులు తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఈ ఆందోళనలకు పార్టీ నాయకత్వం అనుమతి ఇవ్వలేదు. ఇది జనసేన తీరుకు విరుద్ధంగా ఉందని పార్టీ అభిప్రాయం.
కూటమికి భంగం.. విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహారం
రామారావు చేపట్టిన ఈ ఆందోళనలు కూటమి స్ఫూర్తికి భంగం కలిగించేలా ఉన్నాయని పార్టీ పేర్కొంది. అధిష్ఠాన అనుమతి లేకుండా నిరసనల చేపట్టడమే కాకుండా, మీడియాతో చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీ వ్యవస్థపై ప్రభావం చూపినట్లు సమాచారం. అందుకే తక్షణమే ఆయనను బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించింది. తుది నిర్ణయం వెలువడే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
టీడీపీ నుంచి వైకాపా.. ఇప్పుడు జనసేన
రామారావు రాజకీయ ప్రస్థానం గమ్యాలు మార్చుకుంటూ సాగింది. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, 2014లో జవహర్ గెలుపుకు కృషి చేశారు. 2019లో టికెట్ రాకపోవడంతో వైకాపాలో చేరి తానేటి వనితకు మద్దతుగా నిలిచారు. అనంతరం 2023లో వైకాపాకు రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇప్పుడు అదే జనసేన నుంచి పార్టీ బాధ్యతల నుంచి తప్పించబడడం అతనికి మరో మలుపుగా మారింది.
Read Also : Murder : ప్రిన్స్‌పాల్‌ను కత్తితో పొడిచిచంపిన విద్యార్థులు