వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగన్ 2.0’ పేరుతో సరికొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపారు. గత ఎన్నికల పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వైఎస్ జగన్ మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే ఏడాదిన్నర పాటు ప్రజల మధ్యే ఉంటూ రాష్ట్రవ్యాప్తంగా 150 నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. గతంలో పాదయాత్ర ద్వారానే 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన సెంటిమెంట్‌ను, వ్యూహాన్ని ఈసారి కూడా నమ్ముకున్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం వరకు సాగేలా ఈ యాత్ర ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. ప్రతి మూడు రోజులకు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు.
Nalgonda murder: అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు
తాడేపల్లిలో భీమవరం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ ఒక కీలక విషయాన్ని అంగీకరించారు. గత ఐదేళ్ల పాలనలో కేవలం పరిపాలనపైనే దృష్టి పెట్టి, పార్టీ శ్రేణులకు మరియు కార్యకర్తలకు సరైన సమయం కేటాయించలేకపోయానని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. ఈ లోటును భర్తీ చేస్తూ రూపొందించిందే ‘జగన్ 2.0’. ఇకపై గ్రామ స్థాయి నుంచి కమిటీలను బలోపేతం చేస్తూ, ప్రతి కార్యకర్తను నేరుగా కలిసి వారిలో ధైర్యం నింపడమే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. “ఈసారి పోరాటం మామూలుగా ఉండదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపాయి.
ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూనే, రాబోయే రోజుల్లో తానే తిరిగి అధికారంలోకి వస్తానని జగన్ ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత స్తబ్దుగా ఉన్న పార్టీ కేడర్‌ను తిరిగి క్రియాశీలం చేసేందుకు ఈ పాదయాత్ర ఒక సంజీవనిలా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీని మళ్ళీ గెలుపు బాట పట్టించేందుకు కేవలం సంక్షేమ పథకాలే కాకుండా, క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థను నిర్మించడంపై జగన్ 2.0 దృష్టి సారించనుంది. రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు మళ్ళీ ప్రజల దగ్గరకే వెళ్లాలనే పాత ఫార్ములాను జగన్ ఈసారి మరింత పకడ్బందీగా అమలు చేయబోతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com