ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఇవాళ విజయవాడలో ఆకస్మిక తనిఖీలు (Random checks) నిర్వహించారు. గొల్లపూడి, గన్నవరం సివిల్ సప్లై గోడౌన్లను పరిశీలించి, ప్రతి మూలను గమనించారు. పారదర్శక వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేశారు.ఈ సంవత్సరం నుంచి 41,091 పాఠశాలలు, 3,800 హాస్టళ్లకు బియ్యం పంపిణీ కొనసాగుతోంది. 25 కిలోల బస్తాల్లో బియ్యం ఇవ్వగా, వాటిపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు దీనిపై మంచి స్పందన చూపుతున్నారు.విజయవాడ ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి 378 రేషన్ దుకాణాలకు బియ్యం వెళుతోంది. అలాగే గన్నవరం గోడౌన్ నుంచి 103 రేషన్ దుకాణాలకు సరఫరా జరుగుతోంది. అందులో భాగంగా మంత్రి ప్యాకింగ్, బస్తాల నాణ్యతను దగ్గరగా పరిశీలించారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డేటా తనిఖీ
బియ్యం బస్తాపై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను మంత్రి స్వయంగా స్కాన్ చేశారు. వివరాలు సరిగ్గా వస్తున్నాయా అన్నదాన్ని తనిఖీ చేసి, ప్యాకింగ్ లోపాల గురించి హమాలీలను అడిగి తెలుసుకున్నారు.గత మూడున్నర నెలల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించగా, కొంత మంది డీలర్ల వద్ద ఓపెనింగ్, క్లోజింగ్ స్టాక్‌లో తేడాలు కనిపించాయి. నాలుగు డీలర్ల స్టాక్ వెరిఫికేషన్‌లో స్పష్టమైన వ్యత్యాసం బయటపడింది.ఏలూరు రోడ్డులోని ఒక చౌక ధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి, డీలర్ లేకపోవడం, స్టాక్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణం వద్ద స్టాక్, అధికారుల వివరాలతో పాటు క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.
ఇంటి వద్దకే డెలివరీ సేవలు
వృద్ధులు, దివ్యాంగుల కోసం రేషన్ సరుకులు ఇంటికే అందించాలని మంత్రి చెప్పారు. ప్రతి నెల 25 నుంచి 30 లోపు అందేలా చర్యలు చేపట్టారు.గతంలో జరిగిన అవినీతిని గుర్తు చేసిన మంత్రి, ఇప్పుడు జరుగుతున్న తనిఖీలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
Read Also : AP News : జిల్లాల పేర్ల మార్పుపై ఏపీ ప్రభుత్వం చర్యలు