ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ మొత్తం 3.22 లక్షల కోట్లుగా నిర్దేశించబడింది, ఇందులో 48 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్‌లో ముఖ్యంగా విద్యా రంగానికి భారీగా నిధులను కేటాయించారు. పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు కేటాయించారు. విద్యార్థుల నాణ్యతా విద్యను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయంతో విద్యుత్ ఛార్జీల భారం స్థానిక సంస్థలపై తగ్గనుంది.
మున్సిపాల్టీలకు కొత్త విధానాలు – అభివృద్ధికి ప్రాధాన్యత
మున్సిపాల్టీలకు స్వేచ్ఛ కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లులను తామే చెల్లించే స్వతంత్ర హక్కును మున్సిపాల్టీలకు ఇచ్చారు. ఇంతకు ముందు మున్సిపాల్టీల చిన్నపాటి బిల్లుల చెల్లింపులను సంబంధిత శాఖ సెక్రటరీ ఆమోదించాల్సిన విధానం అమలులో ఉండేది. అయితే, నూతన బడ్జెట్ ప్రకారం, నగరాభివృద్ధికి ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ప్రాజెక్టుల నిధుల కొరత తీర్చేందుకు 2 వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అభివృద్ధి ప్రణాళికల అమలుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈసారి బడ్జెట్‌లో తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి నిధులు కేటాయించడం విశేషం. తెలుగు భాషకు ప్రాముఖ్యతనిచ్చే ఉద్దేశ్యంతో రూ.10 కోట్లు కేటాయించారు. భాషా సంరక్షణ, ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అదనంగా, మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. నవోదయం 2.0 స్కీమ్ కింద మద్యపాన వ్యతిరేక ప్రచార కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంచే విధానాన్ని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మద్యపానాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.