తెనాలి చెంచుపేట (గుంటూరు)లో పట్టపగలే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికులను తీవ్రంగా కుదిపేసింది. మంగళవారం మధ్యాహ్నం కైలాష్ భవన్ రోడ్డులోని టిఫిన్ సెంటర్ వద్ద జ్యూటూరి బుజ్జి (50) అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేశాడు. అతను స్కూటీపై మాస్క్ వేసుకుని వచ్చి, కొబ్బరికాయల కత్తితో బుజ్జిని అతి దారుణంగా నరికి అక్కడికక్కడే చంపి పరారయ్యాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు.
Read Also : ఓబీసీ రిజర్వేషన్‌ను 42%కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
సమాచారం అందుకున్న వెంటనే త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నారు. మృతుడు గుంటూరు జిల్లా అమర్తులూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందినవాడు. చెంచుపేటలో ఉన్న కూతురు ఇంటికి వచ్చి టిఫిన్ తీసుకునే సమయంలో ఈ దారుణం జరిగింది.
ప్రస్తుతం పోలీసులు దుండగుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రేమ వ్యవహారం, పాతకక్షలు, లేదా వ్యక్తిగత వివాదం కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అప్రమత్తంగా ఉండి భద్రతను కట్టుదిట్టం చేశారు.
Read Also : RBI గుడ్ న్యూస్ ఇకపై ఇంటర్నెట్ లేకుండా కూడా చెల్లింపులు!