వెనుజువెలాపై అమెరికా దాడి దుర్మార్గం
అమెరికా యుద్ధ చర్యలను భారత ప్రధాని ఖండించాలి
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ డిమాండ్
తిరుపతి బైరాగిపట్టెడలో ట్రంప్ దిష్టిబొమ్మ దహనం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రపంచ బహిష్కరణ చేయాలని సీపీఐ (CPI) జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా మంగళవారం తిరుపతి బైరాగిపట్టెడ కూడలిలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ (CPI)జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేసి, అమెరికా తీరును ఖండిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
Read also: Basmati Rice: భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?
ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ప్రపంచాన్నే ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉందని మండిపడ్డారు. ప్రజాభీష్టం మేరకు ఎన్నికైన ఒక దేశాధ్యక్షుడిని, అతని భార్యను రాత్రికి రాత్రే కిడ్నాప్ చేసినట్టు వ్యవహరించడం మానవహేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే వెనుజులాపై అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడటం వెనుక కార్పొరేట్ కంపెనీల స్వార్థం దాగి ఉందని ఆరోపించారు. ఇది కేవలం సంపాదనపై పిపాసే తప్ప ప్రజాస్వామ్యానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు.

డిమాండ్
ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే అమెరికాలోని క్యాపిటల్, న్యూయార్క్ నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ప్రజల నిర్ణయాలతో గెలిచిన నాయకుడి ప్రవర్తనపై అదే ప్రజలు తిరగబడే పరిస్థితి రావడం ట్రంప్ పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య భారతదేశ ప్రధాని ఇలాంటి యుద్ధోన్మాద చర్యలను ఇప్పటికైనా ఖండించాలని కె.నారాయణ డిమాండ్ చేశారు.
ట్రంప్ అంటే భయంతో మౌనం పాటించడం తగదని, ప్రపంచ దేశాలన్నీ కలసి ట్రంప్ చర్యలను ఖండించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, విశ్వనాథ్, ఉదయ్, బండి చలపతి, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ టి. జనార్దన్, ప్రజాసంఘాల నాయకులు శివ, రామకృష్ణ, కాలయ్య, రామచంద్రయ్య, విజయ, నాగరాజు, శ్రీరాములు, లాజర్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: