📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Corruption : అవినీతికి తెరపడేదెప్పటికి?

Author Icon By Sudha
Updated: February 19, 2026 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జర్మనీలోని బెర్లిన్ కేంద్రంగా పనిచేసే ట్రాన్స్పరెన్సీ ఇంట ర్నేషనల్ అనే సంస్థ 182 దేశాల అవినీతిని పరిగణనలోకి తీసుకొని తయారుచేసిన నివేదిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (సిపిఇఇ) ప్రకా రం అవినీతి సూచిలో స్వల్పంగా మెరుగుపడి భారత్ 39 స్కోర్ తో 91వ ర్యాంకులో నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తేభారత్ స్థానం స్వల్పంగా మెరుగుపడి నట్లు తెలుస్తున్నది. 2024 నివేదిక ప్రకారం 96 ర్యాంకు లో నిలిచింది అంటే 2025 నివేదిక ప్రకారం ఐదు స్థానాలు మెరుగుపరచుకొని 96 నుండి 91కి చేరుకుంది. ట్రాన్స రెన్సీ ఇంటర్నేషనల్ సూచిలో ఏ దేశానికైనా 100 స్కోరు ఉంటే వాటిని అవినీతిరహిత దేశంగా పేర్కొనవచ్చు. 0(జీరో) స్కోరు ఉంటే తీవ్రమైన అవినీతి ఉన్నట్టు. ఈ సంవత్సరం ప్రపంచ సగటు స్కోరు 42కాగా ఆసియా పసిఫిక్ సగటు స్కోరు 45గా నమోదయింది. భారతదేశ సగటు మాత్రం ఈ రెండు సగటుల కంటే తక్కువగా అంటే 39గా ఉండ డం గమనించవచ్చు. గత 10 సంవత్సరాలుగా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆసియా పసిఫిక్ సలహాదారు ఇల్హం మొహ మ్మద్ అభిప్రాయం ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అవినీతి నిరోధక చర్యల ప్రగతి చాలా నెమ్మదిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో అవినీతి, లంచగొంటితనం, ప్రభుత్వ పాలనా పనితీరుపై భారీ ఎత్తున నిరసనలు, అల్లర్లు జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ప్రదేశంలోని చాలా దేశాలలో జవాబుదారి తనంలేని నాయకత్వం, బలహీనమైన చట్టాలు, నిధుల వినియోగంలో పారదర్శకత లోపించడంతో సుపరిపాలనను దెబ్బతీస్తున్నాయి అని ఇల్హామ్ మొహమ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. దక్షిణాసియా దేశాలైన బంగ్లాదేశ్ 24స్కోర్తో 150వ స్థానంలో, పాకిస్థాన్ 28స్కోర్తో 135వ స్థానంలో ఉండగా అత్యంత తక్కువ అవినీతి గల దేశంగా డెన్మార్క్ వరుసగా 7వ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత అవి నీతి రహిత దేశంగా ప్రథమ స్థానంలో నిలిచింది. సీపీఐ ఇండెక్స్ ఆ దేశానికి 90 స్కోరు లభించింది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్(88), సింగపూర్ (84), న్యూజిలాండ్ (83), లక్సెంబర్గ్ (81), నార్వే(81), స్విట్జర్లాండ్(81), స్వీడన్(80), నెదర్లాండ్స్ (78), ఆస్ట్రియా(77) చోటు సంపాదించుకున్నాయి. నివేదికల ప్రకారం పశ్చిమ ఐరోప దేశాలలో అవినీతి తక్కువగా కనిపిస్తుంది. తూర్పు ఐరోపా, మధ్యఆసియా దేశాలలో కూడా అవినీతి(Corruption) ఎక్కువేనని నివేదికలు చెబుతున్నాయి. అతి ఎక్కువ అవినీతి గలిగిన దేశాలు సోమాలియా, దక్షిణ సుడాన్, సిరియా, వెనిజులా, ఎరిత్రియ లాంటి దేశాలు చాలానే ఉన్నాయి.

Read Also : http://Sundar Pichai on Vizag: ప్రపంచానికి గేట్ వేగా విశాఖపట్నం

Corruption

నిజాయితీపై అవగాహన

ప్రపంచవ్యాప్త అవినీతి వలన ప్రపంచ జిడిపిలో సుమారు 5ట్రిలియన్ యుఎస్ డాలర్లు నష్టపోతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. మనదేశంలో అవినీతి(Corruption) నిఅరికట్టడానికి బాధ్యతాయుతమైన పౌరులు, పాలకులు, సమాజంలో నీతి నిజాయితీపై అవగాహన కల్పించడం, పాఠశాల స్థాయి నుండి విలువలతో కూడిన విద్యతో పాటు అవినీతి పై అవగాహన కల్పించడం, ఈగవర్నెన్స్ సాంకేతికత, కఠినమైన చట్టాలు, పారదర్శకత, బాధ్యతాయుత ఉద్యోగస్వామ్యము లాంటివి అవసరం. ఎలక్ట్రానిక్ మనీ, డిజిటల్ లావాదేవీలు, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, ఈ టెండరింగ్, సత్వర సమాచార హక్కు చట్టం లాంటి వాటి ద్వారా అవినీతిని తగ్గించవచ్చు. ప్రభుత్వ సేవలను డిజిటల్యం చేయడం వలన ప్రజలు, అధికారుల మధ్య ముఖాముఖి సంబంధాలను పరిమితం చేయడం చేత అవినీతిని తగ్గించవచ్చు. గవర్నమెంట్ ఈమార్కెటింగ్ విధానం చేత మార్కెట్లలో దళారీల వ్యవస్థలు పరిమితం చేసి అవినీతి తగ్గించవచ్చు. ప్రభుత్వ అనుమతులు, నిబంధనల సరళీకరణ ప్రక్రియలు, ఈప్రొక్యూర్మెంట్ లాంటి పద్ధ తులను పాటించి పారదర్శకతలు పెంచవచ్చు. కఠినమైన చట్టాలను అమలు చేయడంవలన ప్రజలను అవినీతి అంటే భయం ఏర్పడి, అవినీతికి దూరంగా ఉండే అవకాశం ఏర్ప డుతుంది. చట్టాల పరంగా చూసినప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్-యాక్ట్ 1988, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 1988 మొదలైన చట్టాలను కఠినంగా అమలు చేయడం. సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్ధిదారులకు చేరేటట్లు ఆధార్ ద్వారా బ్యాంకు ఖాతాలలో జమ చేయడం వలన మధ్యవర్తుల ప్రమేయం తగ్గిపోతుంది. అవినీతిని బయటపెట్టే వారిని రక్షిస్తూ అవినీతికి వ్యతిరేకంగా ప్రజ లలో అవగాహన కల్పించడం, అవినీతికి పాల్పడిన వారి పైన కఠినచర్యలు తీసుకోవడానికి గాను అవినీతి కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు వేగవంతమైన న్యాయ విచారణ వ్యవస్థను సమకూర్చాలి. కుటుంబ పెద్దలు, తల్లిదండ్రు లు వారి పిల్లలకు చిన్ననాటి నుండి పాపభీతి గురించి వివరించాలి.

Corruption

అవినీతి రహిత దేశం సాధ్యమా?

అవినీతి అనేది వివిధ రకాల పద్ధతులతో అనగా లంచం దుర్వినియోగం, బంధుప్రీతి, దోపిడీ, కిక్ బ్యాంకు లు, మోసం, మనీ లాండరింగ్ ద్వారా జరుగుతున్నది. 2007 నుండి దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ఇండియా అగెనెస్ట్ కరప్షన్ఐఎసి) అనే స్వచ్ఛంద సంస్థలో విభేదాల కారణంగా అవినీతికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రివాల్ ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు అయింది. అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటు అయినా మొదటి పార్టీగా ఎపిపిను గుర్తించవచ్చు.(టిఐఐ) ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తూ దేశంలోని సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న అవినీతి సమ స్యలను అర్థం చేసుకోవడంలోను, విస్తృతమైన అవగాహన నైపుణ్యాలను కలిగి ఉన్నది. దేశంలో ప్రముఖమైన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అవినీతికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష ప్రారంభించడం వలన ఈ ఉద్యమం కొత్త పుంతలు తొక్కిం ది. జన లోక్పాల్ బిల్లును పాస్ చేయించి అవినీతిని నిర్మూలించాలని ఈఉద్యమ అంతిమ లక్ష్యం. 2005 ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ నివేదిక ప్రకారం మనదేశంలో 62 మంది, 2008 నివేదిక ప్రకారం 50మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో లంచాలు ఇచ్చి పని చేయించుకున్న వారేనని తెలుస్తున్నది. దేశంలో అవినీతికి కారణాలను విశ్లేషిస్తే అపా రదర్శక బ్యూరోక్రసి, విచక్షణ అధికారాలు గల్గిన ప్రభుత్వ కార్యాలయాలు అధికారులు, అధిక నిబంధనలు కలిగిన వ్యవస్థ, సంక్లిష్టమైన పన్ను లైసెన్సింగ్ విధానం, కొన్ని వస్తువులు సేవల పంపిణీ పై ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థల గుత్తాధిపత్యం పారదర్శక ప్రక్రియ చక్కగా లేకపోవ డం, ముఖ్యంగా చాలామంది ప్రజలు చైతన్యవంతులు కాక అవినీతిని ఎదిరించకపోవడం లాంటి కారణాలుగా గుర్తించవచ్చు. దేశంలో అవినీతిని నిర్మూలించడానికి 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి 2003 లో చట్టబద్ధ హోదా కల్పించారు. ప్రభుత్వ పనులకు చట్ట విరుద్ధంగా డబ్బులు తీసుకోవడం, పనులను చేయడానికి అనైతిక పద్ధతులను అవలంబించడం, ప్రభుత్వ అధికారులు ప్రజల నుండి పనుల నిమిత్తం అక్రమంగా డబ్బులు తీసుకో వడం లాంటివి అరికట్టడంలో సివిసి పనిచేస్తుంది. ఏది ఏమైనా ప్రజలు, ప్రభుత్వాలు, వ్యవస్థలు కలిసికట్టుగా అవినీతి రహిత దేశానికి పాటుపడాలి.
-డా. కావలి చెన్నయ్య

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anti-Corruption Breaking News Corruption Governance latest news Political Reform Telugu News Transparency

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.