తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత(Cold wave) రోజు రోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా భారీగా తగ్గిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోవడంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉదయం వేళల్లో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
Read Also:TG Weather: తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కసారిగా చలి ప్రభావం(Cold wave) ఎక్కువగా కనిపిస్తుండగా, తెలంగాణలోనూ అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి దిగజారినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో చలిని తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్ ప్రాంతంలో శనివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతగా అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ప్రాంతంలో 4.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.రాబోయే రెండు రోజుల పాటు కూడా చలి తీవ్రత కొనసాగడంతో పాటు మరింత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు చలిబాధల నుంచి రక్షణ చర్యలు పాటించాలని సూచించింది.
ఇక హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత అధికంగా ఉండటంతో నగరవాసులు వణికిపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోతున్నాయి. శనివారం శేరిలింగంపల్లిలో 7.8 డిగ్రీలు, మల్కాజ్‌గిరిలో 8.3 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి, ఉదయం మాత్రమే కాకుండా మధ్యాహ్నం వేళల్లో కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోవచ్చని అధికారులు హెచ్చరిస్తూ, వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: