ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తన సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam)లో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం శివపురంలో నిర్మించిన ఈ కొత్త ఇంట్లో ఈ తెల్లవారుజామున పవిత్రమైన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదమంత్రాల నడుమ కుటుంబ సభ్యులు పాల్గొనగా, ఈ సందర్భంగా సంప్రదాయ పద్దతిలో హోమాలు, పూజలు నిర్వహించారు.
నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు
ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పండుగలా కనిపించిన ఈ సందర్భం చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా జరిగింది. గృహప్రవేశం సందర్భంగా సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె, “36 ఏళ్లుగా కుప్పం ప్రజలు మా కుటుంబానికి అండగా ఉన్నారు. ఇది మా కోసం ఎంతో ప్రత్యేకమైన క్షణం,” అంటూ పేర్కొన్నారు.
కుప్పంలో శాశ్వత నివాసం
చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి 1989 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఈ నియోజకవర్గం ఆయనకు కీలక బలంగా నిలిచిందని పలుమార్లు చెప్పారు. ఇప్పుడు శాశ్వత నివాసంగా కుప్పంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, ఈ కొత్త ఇంటి గృహప్రవేశం కార్యక్రమం కుప్పం ప్రజలతో ఆయన బంధాన్ని మరోసారి చాటిచెప్పింది. ఇది ఆయనకు గృహప్రవేశం మాత్రమే కాక, ప్రజలతో ఉన్న అనుబంధానికి ఓ చిహ్నంగా మారింది.
Read Also : పెరుగుతున్న కరోనా కేసులు..రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక