చిత్తూరు: మామిడి రైతులు పల్ప్ ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసి మూడు నెలలు కావస్తుంది. అయితే పల్ప్ ఫ్యాక్టరీల నుండి మామిడి రైతుకు ఇప్పటి వరకు చిల్లిగవ్వ రాలేదు. మామిడి సీజన్లో ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసిన రైతులు ఫ్యాక్టరీలు చెల్లించే డబ్బులపై ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ జిల్లాలోని పల్ప్ ఫ్యాక్టరీలు మాత్రం మామిడి రైతును కనికరించడం లేదు. ఈ మేరకు జిల్లాలో మామిడి రైతులు ఫ్యాక్టరీల నుండి తమకు రావాల్సిన బకాయిలు వసూలు చేయడానికి మరోసారి ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నారు.
మామిడికి గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు
జిల్లాలో మామిడి సీజన్లో మే, జూన్, జులై నెలల్లో 35 వేల మంది మామిడి రైతులు 4 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని పల్ప్ ఫ్యాక్టరీలకు తరలించారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ సీజన్లో మామిడికి గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకుంది. కలెక్టర్ సుమిత్కుమార్(Sumit Kumar), ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో చర్చించి మామిడి రైతుకు ఒక కేజీపై రూ.4 ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే విధంగా, పల్ప్ ఫ్యాక్టరీలు ఒక కేజీ మామిడిపై రైతుకు రూ.8 చెల్లిచేలా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ సీజన్ లో మామిడి రైతుకు ఒక కేజీ పై రూ.12 లభిస్తుందని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ మొత్తం ఆశించిన మేరకు రైతుకు గిట్టుబాటు కాకపోయినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు అంగీకరించాల్సి వచ్చింది. ఈ మేరకుపల్ప్ ఫ్యాక్టరీలు, ర్యాంపులకు మామిడి రైతులు సీజన్లో 3 నెలల పాటు 4 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు తోతాపురి మామిడి(Totapuri mango)ని సరఫరా చేశారు. అయితే ప్రభుత్వం రైతుకు కేజీ తోతాపురి మామిడిపై చెల్లిస్తామని చెప్పిన రూ.4 ఇప్పటి వరకు చెల్లించలేదు. అలాగే పల్ప్ ఫ్యాక్టరీలు సీజన్లో కేజీ తోతాపురిపై రూ.8 చెల్లిస్తామని చెప్పినప్పటికీ అత్యధిక పల్ప్ ఫ్యాక్టరీలు రైతుకు ఒక కేజీ తోతాపురి మామిడిపై రూ.4 నుండి రూ.5 వరకు మాత్రమే చెల్లించడానికి సుముఖంగా వున్నాయి. మిగిలిన మొత్తం చెల్లించడానికి తాము సిద్ధంగా లేమని ఇప్పటికే పలు పల్ప్ ఫ్యాక్టరీలు మామిడి రైతులకు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీలకు మామిడి కాయలు సరఫరా చేసి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఫ్యాక్టరీల నుండి ఒక్క పైసా చెల్లింపులు జరుగపోవడంపై మామిడి రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: