దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతూ వీరమరణం పొందిన ఈ యువజవాన్ పట్ల ప్రజల గుండెల్లో గౌరవంతో పాటు గాఢమైన విషాదం నెలకొంది. మురళీ నాయక్ పుట్టినూరు – సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా, వేలాది మంది ప్రజలు కన్నీటి కళ్లతో పాల్గొన్నారు.
ప్రముఖుల ఘన నివాళులు
ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సత్యప్రసాద్, మురళీ నాయక్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అంత్య క్రియలు ముగిసే వరకూ అక్కడే ఉన్నారు.
చంద్రబాబు భావోద్వేగ ట్వీట్
తాజాగా సీఎం నారా చంద్రబాబు నాయుడు “X (ట్విట్టర్)” వేదికగా మురళీ నాయక్ కు నివాళులు అర్పిస్తూ భావోద్వేగపూరితంగా స్పందించారు. ‘వీర జవాన్ మురళీ నాయక్ కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగుభూమితో పాటు 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీ నాయక్ నేడు మన మధ్య లేకపోయినా ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తునే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
పవన్ కళ్యాణ్ కన్నీటి స్పందన
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తీవ్ర భావోద్వేగంతో ఉన్న మురళీ నాయక్ కుటుంబాన్ని పవన్ ఓదార్చారు. వాళ్లకు ధైర్య చెప్పారు. ఈ క్రమంలో పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడి వారిని కలిచివేసింది. మంత్రి నారా లోకేశ్ కూడా మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. జవాన్ తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రజల సంఘీభావం నివాళుల ర్యాలీ
జవాన్ మురళీ నాయక్ పార్థివదేహాన్ని తరలించే సమయంలో జిల్లా అంతా శోకసంద్రంగా మారింది. గ్రామాలు, కూడళ్లలో ప్రజలు జాతీయ జెండాలతో మురళీకి వీడ్కోలు పలికారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు – వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీరజవాన్‌కు నివాళులర్పించారు. మంత్రి సవిత నేతృత్వంలో భారీ కాన్వాయ్ నిర్వహించగా, బెంగళూరు నుంచి కళ్లితండాకు 8 గంటల 90 నిమిషాల ప్రయాణం సాగింది. ఇది మురళీ నాయక్ పట్ల ప్రజల గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. దేశ రక్షణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మురళీ నాయక్ లాంటి వీరయోధులు ఈ దేశానికి చిరస్మరణీయంగా నిలుస్తారు.
Read also: Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే లైన్ ఎక్కడంటే?