ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పుట్టపర్తి సత్యసాయిబాబా (Puttaparthi Sathya Sai Baba) చూపిన తపన, సంకల్పబలం గురించి స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. పుట్టపర్తి, చుట్టుపక్కల తాగునీటి సమస్యలు ఉన్నప్పటికీ, అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టినా ప్రాజెక్టు పూర్తిచేస్తాను అని సాయిబాబా అన్న సంకల్పాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గొప్ప లక్ష్యం కోసం కృషి చేస్తే నిధులు, సహకారం సహజంగానే వస్తాయని అన్నారు.ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించి 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా, అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ప్రజాసేవలో అంకితభావం ఎంత అవసరమో వివరించారు.
తపన ఉంటే ఏదైనా సాధ్యం
“సత్యసాయిబాబా ఒకసారి పిలిచి తాగునీటి సమస్యపై మాట్లాడారు. భక్తుల సహకారంతో లేదా నిలయాన్ని తాకట్టు పెట్టినా ప్రాజెక్టు పూర్తిచేస్తానని ఆయన చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆయన పిలుపుతోనే పెద్దఎత్తున నిధులు వచ్చాయి. ప్రాజెక్టు విజయవంతమైంది” అని చంద్రబాబు వివరించారు. సంకల్పం ఉంటే అసాధ్యమని ఏదీ లేదని ఆయన అన్నారు.తన పాలనలో ఎదురైన సవాళ్లను ప్రస్తావిస్తూ చంద్రబాబు, విమర్శలకు భయపడితే సంస్కరణలు సాధ్యం కాదని అన్నారు. “నేను ఎప్పుడూ కొత్తగా ఆలోచించేందుకు వెనకడుగు వేయలేదు. విద్య, సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చాం. వెనుకబడిన రంగారెడ్డి జిల్లాలో 240 ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపించాం” అని గుర్తుచేశారు.
ఐటీ అభివృద్ధికి పునాది వేసిన విధానం
హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, భూములు ఇస్తామన్నా కంపెనీలు ముందుకు రాలేదు. మౌలిక సదుపాయాలు కల్పించి, వారిని ఒప్పించి హైటెక్స్ వంటి సంస్థలను తీసుకొచ్చాం అని తెలిపారు. విజన్ ఉంటే ప్రాంతాలు ఎలా మారిపోతాయో ఇది నిదర్శనమని అన్నారు.రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు కీలకం అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమలో ఫ్యాక్షన్, తెలంగాణలో నక్సలిజం, హైదరాబాద్‌లో మత ఘర్షణలు ఒకప్పుడు భయంకరంగా ఉండేవి. సమర్థులైన అధికారులను నియమించి ఉక్కుపాదం మోపాం. లా అండ్ ఆర్డర్ కఠినంగా అమలు చేసి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చాం అని తెలిపారు.
మహిళా సాధికారత, రైతు సంక్షేమం
డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు విమర్శలు ఎదురైనా, నేడు వాటి ఫలితాలు దేశమంతా స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. రైతుల కోసం దేశంలోనే తొలిసారిగా ఇన్‌పుట్ సబ్సిడీ అమలు చేశామని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి బాధితులను సురక్షితంగా చేర్చిన విషయాన్ని గుర్తుచేశారు.ఓట్లు రావచ్చు, రాకపోవచ్చు. కానీ కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వడమే నాకు తృప్తి ఇస్తుంది అని చంద్రబాబు అన్నారు. కులవృత్తుల వారికి ఆదరణ పథకం ద్వారా అండగా నిలిచామని తెలిపారు. అధికారులు సృజనాత్మకంగా ఆలోచించి పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని సూచించారు.
Read Also :