ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు వారసత్వ సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ మాస్ లీడర్ బొత్స సత్యనారాయణ తనయ డాక్టర్ బొత్స అనూష రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. గత రెండు నెలలుగా క్షేత్ర స్థాయిలో ఆమె చురుకుగా పాల్గొంటూ, నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు హాజరవుతూ, ప్రజల సమస్యలను ఆప్యాయంగా వింటూ, తన తండ్రి తరహాలోనే భరోసా ఇస్తున్నారు. పార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. ఈ ప్రజా ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ, ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Latest News: Amit Shah: నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన
బొత్స అనూష తన సోదరుడు డాక్టర్ బొత్స సందీప్‌తో కలిసి చీపురుపల్లి నియోజకవర్గంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. సీనియర్ నేతలైన బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాసరావుతో కలిసి మండల కేంద్రాలు, గ్రామాల్లో పర్యటించారు. స్వతహాగా డాక్టర్ అయిన అనూష.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు జరిగే అన్యాయాన్ని కూలంకషంగా వివరిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో సుమారు 70 వేల సంతకాలను సేకరించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ సంతకాలను జిల్లా కార్యాలయానికి పంపించేందుకు నిర్వహించిన ర్యాలీలో డా. అనూష, డా. సందీప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇది ఒకరకంగా ఆమె రాజకీయ ఆరంగేట్రానికి బలమైన వేదికగా నిలుస్తోంది.
బొత్స అనూష తన తల్లి బొత్స ఝాన్సీ తరహాలోనే రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బొత్స ఝాన్సీ తొలుత జెడ్పీ చైర్ పర్సన్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత బొబ్బిలి, విజయనగరం పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అదే తరహాలో బొత్స అనూష సైతం త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బొత్స సత్యనారాయణ గారు తన వారసులను చీపురుపల్లిలో యాక్టివ్ చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజల్లో మమేకమయ్యేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. బొత్స తనయుడు సందీప్ ఇప్పటికే ‘ధీర ఫౌండేషన్’ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుండగా, ఇప్పుడు అనూష రాకతో బొత్స అభిమానుల్లో ఆనందం నెలకొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com