సత్తెనపల్లి : రాష్ట్రంలోని పత్తి రైతులు(Atchannaidu) ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రికింజరాపు అచ్చెన్నాయుడు హమీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి మంగళవారం పేరేచెర్ల, సత్తెనపల్లిలోని సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించి, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పత్తి తేమశాతం నమోదుతో పాటు, కొనుగోలు విధానం, యాప్ సమస్యలు, ఎల్1 నుండి ఎల్4 గ్రేడింగ్ సమస్యలపై వివరంగా పరిశీలించారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని రైతులకు హమీఇచ్చారు.
Read also: అమెరికా దత్తత కథలో భారత అమ్మాయి భావోద్వేగ షాక్

ప్రతి పత్తి రైతుకు ప్రభుత్వం నుంచి పూర్తి భరోసా
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రతి కిలో పత్తి కొనుగోలు అయ్యేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది అని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం పత్తి రైతులకు పలు కష్టాలు వర్షాలు, దిగుబడితగ్గడం, సిసిఐ కఠిన నిబంధనలు రూపంలో వచ్చాయని తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 5 లక్షల 40 వేల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. దాదాపు 8 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల పత్తి నాణ్యత దెబ్బ తింది. దిగుబడి తగ్గిన రైతులకు పైగా సిసిఐ అనేక కఠిన నిబంధనలు పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు పెరిగాయి. ముఖ్యంగా కొత్తగా అమలు చేస్తున్న ఎల్1, ఎల్2, ఎల్ 3, ఎల్4 గ్రేడింగ్ విధానం రైతులకు పెద్ద భారమవుతోంది. పంటే నష్టపోయింది.. దానిపై ఇంకా నిబంధనలు పెట్టడం సరైంది కాదు. రైతులకు అన్యాయం జరగకుండా అన్ని నియమాలను పునఃసమీక్షించాలని కొద్ది రోజుల క్రితమే కేంద్రాన్ని కోరామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పూర్తిగా వివరించారు.
సిసిఐ నిబంధనల సడలింపులు కేంద్రం నుంచి హామీ
కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి,(Atchannaidu) సిసిఐ చైర్మన్, ఎండీతో నేరుగా మాట్లాడి పత్తి కొనుగోలు నిబంధనల సడలింపులు చేయాలని కోరినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కూడా కేంద్రమంత్రి స్థాయిలో మాట్లాడి, ఒకసారి ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించిన తర్వాత రైతుకు కొత్త నిబంధనలు పెట్టే అవకాశం ఉండకూడదు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మిల్లులతో పాటు అదనంగా మరిన్ని మిల్లులు తక్షణం ఓపెన్ చేయండి అని సిసిఐ ఎండికి కేంద్ర మంత్రి రామ్మోహన్ కోరడంతో కొనుగోలు వేగవంతానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, ప్రతిస్పందనగా సిసిఐ ఎండి నుంచి డిసెంబరు 1 నుంచి అన్ని మిల్లులు పూర్తిగా ఓపెన్ చేస్తాం అన్న హామీ ఇచ్చటినట్లు తెలిపారు. పేరేచెర్ల సెంటర్లో ఒక మిల్ అదనంగా, సత్తెనపల్లిలో అన్ని మిల్లులు పూర్తిగా ఓపెన్ కానున్నాయని వెల్లడించారు. ఈ సంవత్సరం తడిసిన పత్తి కారణంగా తేమ శాతం పెరగడంతో, 12 నుండి 18 వరకు తేమ ఉన్న పత్తిని కూడా సిసిఐ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ప్రతి రైతుకి న్యాయం జరుగుతుందనే పూర్తి హామీ ఇచ్చారు. పత్తి విక్రయం కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నారు. రైతులు కూడా నాణ్యమైన పంటలు పండించాలి, డిమాండ్ ఉన్న పంటల వైపు ముందుగా ప్రణాళికతో వెళ్లాలి అని సూచించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :