తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న మహానాడు (Mahanadu) రెండో రోజున ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ముప్పై ఏళ్లుగా ఆయన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య చేత చంద్రబాబు ప్రమాణం చేశారు. అనంతరం కార్యకర్తలతో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు.తెలుగుదేశం పార్టీ బలహీనమవ్వకుండానే ముందుకు సాగింది. దీనికంతటికీ కారణం మా కార్యకర్తలే, అని చంద్రబాబు స్పష్టం చేశారు. కడప మహానాడు విజయవంతం కావడంపై ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఆరు కీలక తీర్మానాలు ఆమోదించామని, రాబోయే 40 ఏళ్లకు గణనీయమైన ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. “ప్రపంచంలో తెలుగుజాతి పేరు గౌరవంగా వినిపించేందుకు టీడీపీ మాత్రమే అర్హం,” అని ధీమాగా చెప్పారు.
హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా మార్చిన పార్టీ మేమే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటినీ సమానంగా ప్రేమిస్తానని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అభివృద్ధికి పునాది వేసిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి సైబరాబాద్‌గా తీర్చిదిద్దింది మా ప్రభుత్వం, అని చెప్పారు. 47 ఏళ్లుగా ప్రజలు తనను ఆదరిస్తున్నారని, ఆ రుణాన్ని తీరుస్తానన్నారు. ప్రతి రైతు కష్టానికి గౌరవం కల్పించడమే తన లక్ష్యమని వెల్లడించారు.
అమరావతి కలను నెరవేర్చేందుకు అంకితభావంతో పనిచేస్తా
అమరావతిని ప్రజల రాజధానిగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేసాం, అని చంద్రబాబు చెప్పారు. ప్రజలు, కార్యకర్తల ఆశీస్సులతో ఈ లక్ష్యాన్ని నెరవేర్చతామని ధైర్యంగా ప్రకటించారు. ఒక్కొక్క దశలో అభివృద్ధి కనిపిస్తుందని, టీడీపీ హయాంలో రాష్ట్రం తిరిగి గౌరవం సంపాదిస్తుందని చెప్పారు.
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో గంజాయి దందా పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు పరిశ్రమలా మారింది, అని ఆరోపించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోనివ్వమన్నారు. తప్పు చేసిన వారిని ఎంతటి వారైనా శిక్షిస్తామని స్పష్టం చేశారు. “శాంతిభద్రతల పరిరక్షణ మా ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత, అని చెప్పేశారు.
రాయలసీమకు జీవనదులా నీటి ప్రాజెక్టులు
రాయలసీమను ఎడారి సీమగా మిగలకుండా, సస్యశ్యామలం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్న ఆయన, వాటిని తన పాలనలో ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ఈ ఏడాది రాయలసీమ నీటి ప్రాజెక్టులకు రూ.3,800 కోట్లు కేటాయించామని వివరించారు. హంద్రీనీవా ప్రాజెక్టు ప్రస్తుతం అత్యధిక నిధులు పొందుతోందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి పూర్తి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.చివరిగా, పార్టీ నాయకత్వాన్ని మళ్లీ అప్పగించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మీ ఆశలు నెరవేర్చేందుకు ప్రతీ గంట పనిచేస్తా, అని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అంటే ప్రజల అభివృద్ధే లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.
Read Also : Chandrababu Naidu: లోకేశ్ మహానాడును మలుపు తిప్పారు: చంద్రబాబు ప్రశంస