ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను, ఇతర పురపాలక సేవల కోసం ప్రజలు మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, వేగంగా అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను రూపొందించారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, పౌరులకు నేరుగా ప్రభుత్వంతో అనుసంధానం ఏర్పడుతుంది.
Read Also: Deputy Speaker Raghurama Krishna Raju : ఏపీ డిప్యూటీ స్పీకర్ కు గాయాలు
ప్రతి ఇంటికీ ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్
ఈ వినూత్న విధానంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రతి ఇంటికీ, వాణిజ్య భవనానికీ ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను కేటాయించనున్నారు. ఈ కోడ్‌ను ఆయా ఇళ్ల గోడలకు లేదా ప్రధాన ద్వారాలకు (Doors) అధికారులు అంటించనున్నారు. ఇది ఆ ఇంటికి సంబంధించిన ఒక ‘డిజిటల్ అడ్రస్’గా పనిచేస్తుంది. పౌరులు తమ స్మార్ట్‌ఫోన్‌తో ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే, ఆ ఆస్తికి సంబంధించిన పూర్తి డేటా నిమిషాల్లో ప్రత్యక్షమవుతుంది.ఇంటి విస్తీర్ణం, ఏటా చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తం, ఏవైనా బకాయిలు ఉంటే ఆ వివరాలు స్పష్టంగా తెలుసుకోవచ్చని అధికారులు వివరించారు. అదేవిధంగా వ్యాపార సంస్థలు, దుకాణాల యజమానులు తమ ట్రేడ్ లైసెన్స్ ఫీజుల బకాయిలను కూడా దీని ద్వారా తెలుసుకుని చెల్లించవచ్చు.
ఫిర్యాదులు ఇకపై సులభం..
కేవలం పన్నుల చెల్లింపులకే కాకుండా ఇతర సమస్యలపై ఫిర్యాదు చేయడానికి కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చెత్తను తొలగించడం లేదని ఫిర్యాదు చేయాలన్నా, మురుగునీటి పారుదల సమస్యలున్నా ఈ పోర్టల్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. దీనివల్ల అధికారులను నేరుగా కలవాల్సిన అవసరం ప్రజలకు తప్పుతుంది.ఈ క్యూఆర్ కోడ్ విధానం ద్వారా మరిన్ని అదనపు సేవలను కూడా అందించనున్నారు. కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు, ఆ ఇంటికి సమీపంలో ఉన్న థియేటర్లు, జిమ్‌లు, కల్యాణ మండపాలు,
హోటళ్లు, దుకాణాలు, విద్యా సంస్థల వివరాలు కూడా కనిపిస్తాయి. వారిని సంప్రదించడానికి వీలుగా మొబైల్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో “సిటీ సర్వీస్ సెంటర్ల” కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ క్యూఆర్ కోడ్ ప్రాజెక్టును ఏపీలో కూడా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధానంతో పౌర సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: