AP Inter exams : విజయవాడ, జనవరి 7 ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు.
ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతలుగా జరగనున్న ప్రాక్టికల్ పరీక్షల సందర్భంగా, ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను నేరుగా బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని సూచించారు. దీని ద్వారా పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 45 సమస్యాత్మక (AP Inter exams) పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి, వాటిని రాష్ట్ర కార్యాలయం నుంచే నిరంతరం పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల పబ్లిక్ పరీక్షలు, ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?
ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు రంజిత్ బాషా తెలిపారు. ఈ మార్పులపై పరీక్షా కేంద్రాల సిబ్బంది, అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్న పబ్లిక్ పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షలను కూడా అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకే ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. సీసీ కెమెరాల నిఘాతో ఎలాంటి అక్రమాలకు అవకాశం ఉండదని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: