AP High Court: అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాలో భూసేకరణ కోసం జారీచేసిన నోటిఫికేషన్లు సవాలు చేస్తూ భూ యజమానులు దాఖలు చేసిన వ్యాజ్యాలను ఏపీ హైకోర్టు కొట్టేసింది. వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రజాప్రయోజనం మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు సమాజ హితానికే పెద్దపీట వేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. భూసేకరణ ప్రకటనలో భూయజమానుల పేర్లను ప్రచురించాల్సిన అవసరం లేదని పేర్కొంది. జాతీయ రహదారుల భూసేకరణకు ఎక్కువ మంది యజమానులు సానుకూలంగా ఉన్నారని తెలిపిన కోర్టు, కొద్దిమంది అభ్యంతరం చెబుతున్నారన్న కారణంతో మొత్తం ప్రక్రియను నిలువరించలేమని తేల్చిచెప్పింది.
నోటిఫికేషన్ నిబంధనలపై స్పష్టత
భూసేకరణ ప్రకటనలో భూయజమానుల పేర్లను ప్రచురించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్లో భూముల వివరాలను సంక్షిప్తంగా పేర్కొంటే చాలంది. ప్రకటనలో భూయజమానుల పేర్లను పేర్కొనకపోయినంతమాత్రాన ఆ భూసేకరణ ప్రకటన చెల్లకుండా పోయినట్లు కాదంది. మరోవైపు నోటిఫికేషన్ వివరాలను రెండు స్థానిక పత్రికల్లో ప్రచురిస్తే సరిపోతుందని వెల్లడించింది. ఆయా పత్రికల సర్క్యులేషన్ ఎంత అనేదానితో సంబంధం లేదంది. విసృత సర్క్యులేషన్ ఉన్న పత్రికల్లోనే ప్రకటన ఇవ్వాలనే నిబంధనలు లేవని తెలిపింది.
రైతుల అభ్యంతరాలు
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా జాతీయ రహదారి నిర్మాణ కోసం వైఎస్సార్ కడప జిల్లాలోని 12 మండలాల పరిధిలోని 49 రెవెన్యూ గ్రామాల్లో 124 కి.మీ (75 కి.మీ నుంచి 199 కి.మీ వరకు) రహదారి ఏర్పాటు కోసం అధికారులు 2023లో భూసేకరణ ప్రకటన జారీచేశారు. ఈ ప్రకటనను సవాలు చేస్తూ వివిధ ప్రాంతాల్లో భూములున్న కొందరు యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. భూసేకరణ ప్రకటన చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. వాస్తవానికి తమ భూమి జాతీయ రహదారి ఏర్పాటుకు అవసరం లేదన్నారు. డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ మధ్య తమ భూములున్నాయన్నారు. తమ భూములను తీసుకొని వాణిజ్య అవసరాలకు వినియోగించాలని చూస్తున్నారన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: