నూతన సంవత్సరం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) భూయజమానులకు శుభవార్త అందించింది. ఎన్నాళ్లుగానో 22ఏ నిషేధ జాబితాలో ఉండి లావాదేవీలు జరగకుండా నిలిచిపోయిన భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విస్తృత చర్చల అనంతరం ఐదు రకాల భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. మిగిలిన భూములపై కూడా త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also: 2025 : 2025లో సంతృప్తినిచ్చిన జ్ఞాపకాలు ఇవే అంటూ లోకేశ్ ట్వీట్
భూయజమానులకు ఏపీ ప్రభుత్వం ఊరట
ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా ఆదేశాలపై సంతకం చేశారు. 22ఏ జాబితా నుంచి తొలగించిన ఐదు రకాల భూముల(AP Govt) విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన నాలుగు కేటగిరీలపై జీవో జారీకి ముందు మరింత చర్చ జరపనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రైవేట్ పట్టా భూములను పూర్తిగా 22ఏ జాబితా నుంచి తొలగించనున్నారు. ప్రైవేట్ భూములకు సంబంధించి ఎవరు దరఖాస్తు చేసినా అధికారులు సుమోటోగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములు అవసరమైన పత్రాలు ఉన్న పక్షంలో నిషేధ జాబితా నుంచి తొలగించాలన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల భూములు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు కూడా 22ఏ పరిధి నుంచి బయటకు తీసుకురానున్నారు. భూ కేటాయింపుల విషయంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఇచ్చిన సిఫార్సుల రిజిస్టర్ ఒక్కటే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
అదేవిధంగా 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్ఎ రికార్డులు, ఎసైన్‌మెంట్ రిజిస్టర్లు, డీఆర్ దస్త్రాలు వంటి పాత రెవెన్యూ పత్రాల్లో ఏదో ఒకటి ఉన్నా చాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, 8ఏ రిజిస్టర్లు లేదా డీకేటీ పట్టాలలో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుందని తెలిపింది. మొత్తం దాదాపు ఎనిమిది రకాల పత్రాల్లో ఏదైనా ఒకటి చూపిస్తే భూమిని 22ఏ జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదనపు పత్రాల కోసం భూయజమానులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టంగా ప్రభుత్వం పేర్కొంది. రైతులు, భూయజమానుల హక్కుల పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నూతన సంవత్సరం కానుకగా ఈ నిర్ణయం భూయజమానులకు పెద్ద ఊరటగా మారనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: