విజయవాడ : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ ఉపాధ్యాయ పట్ట భద్రులకు శుభవార్త చెప్పే దిశలో అడుగులు వేస్తోంది. ఇటీవలే మెగా డీఎస్సీ ద్వారా భారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఆ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సిద్ధమైంది. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ 2,500 పోస్టుల భర్తీకి సన్నద్దమవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో సుమారు 2,500 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. పదవీ విరమణలు, మోడల్ స్కూళ్ల ఏర్పాటుతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈసారి డీఎస్సీ పరీక్షలో ఆంగ్లం, కంప్యూటర్ అవగాహనపై అదనపు పేపర్లు ఉండనున్నాయి.
Read also: AP: రేపటి నుంచి సినీ నిర్మాత బండ్ల గణేశ్ తిరుమల పాదయాత్ర
Mega DSC next month
మరిన్ని ఖాళీలకు అవకాశం
ఈ మార్పులతో విద్యావ్యవస్థ నాణ్యత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే స్వల్ప సంఖ్యలో ఖాళీలు ఉండటంతో ఈ భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. గతంలో జీవో 117ను రద్దు చేశారు. దీంతో పాటు 9 రకాల స్కూళ్లను తీసుకురావడం, 9,200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి, ప్రతి తరగతికి ఒక టీచర్ అన్న నిబంధన తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అదనంగా 1,146 మంది టీచర్లు అవసరమని గుర్తించారు. ఈ ఖాళీలతో పాటు మరికొన్నింటిని కలిపి మొత్తంగా 2,500 టీచర్ పోస్టుల భర్తీ కోసం కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో డీఎస్సీ 2026 ప్రకటన విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టెట్ (TET) నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలు సేకరించే ప్రక్రియ కొలిక్కి వచ్చింది.
లక్ష్యం – నాణ్యమైన విద్య
ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో సుమారు 986 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు 30వేల మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఈ కొత్త డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో మెగా డీఎస్సీ 2025లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 1,672పోస్టులను భర్తీ చేశారు. పలు సాంకేతిక కారణాల వల్ల కొన్ని పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పదవీ విరమణల వల్ల మరిన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. గత ఏడాది జిల్లాలో సుమారు 460 ప్రాథమిక పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా మార్చారు. ఈ కారణాల వల్ల అదనంగా ఉపాధ్యాయులు అవసరమవుతారు. కేవలం ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా, విద్యా నాణ్యతను పెంచేలా ప్రణాళికలు వేస్తున్నారు.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 18 తరగతుల వరకు ఎన్సీ ఈ ఆర్టీ సిలబస్ బోధించేందుకు కొత్త పుస్తకాలు తీసుకురానున్నారు. డీఎస్సీ పరీక్షలో ఆంగ్ల భాష, కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకు డీఎస్సీ పరీక్ష కేవలం సంబంధిత సబ్జెక్టుపైనే జరిగేది. కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పలు ఉద్యోగపోటీ పరీక్షల్లో ఆంగ్ల భాషకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో కూడా ఆంగ్ల భాషా ప్రావీణ్యంపై ప్రాథమిక స్థాయి పరీక్ష తప్పనిసరి చేయనున్నారు. ఈ మార్పుల వల్ల ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ మరింత పటిష్టంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త విధానాలు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: