ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దిశగా చేపట్టిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహిస్తూ కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 5,555 ఈ-సైకిళ్లను (E-bicycles) పంపిణీ చేసి, జిల్లా యంత్రాంగం సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఏపీ ప్రభుత్వం మరియు ‘ఈ-మోటోరాడ్’ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా సామాన్యులకు పర్యావరణ హిత రవాణాను అందుబాటులోకి తెచ్చారు. ఈ భారీ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన అవార్డును గిన్నిస్ రికార్డు ప్రతినిధుల నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని ఆవిష్కరించారు.
Arava Sreedhar : జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు
ఈ పథకం కింద పంపిణీ చేసిన ఒక్కో ఈ-సైకిల్ అసలు ధర రూ. 35,000 ఉండగా, ప్రభుత్వం రూ. 10,000 భారీ రాయితీని ప్రకటించింది. దీనివల్ల లబ్ధిదారులు కేవలం రూ. 25,000లకే ఈ అత్యాధునిక సైకిల్‌ను పొందగలిగారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ సైకిళ్లను కుప్పంలోనే అసెంబుల్ చేయడం వల్ల స్థానిక ఉపాధికి కూడా ఊతమిచ్చినట్లయింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు స్వయంగా ఈ-సైకిల్ తొక్కుతూ సుమారు 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి, ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, కుప్పాన్ని దేశంలోనే పూర్తి పర్యావరణ హిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇంటిపై ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఈ సైకిళ్లను ఛార్జింగ్ చేసుకుంటే, రూపాయి ఖర్చు లేని ప్రయాణం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ఈ ‘సూపర్ సైకిల్స్’ సామాన్యుడి రవాణా భారానికి పరిష్కారం చూపుతాయని, త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రికార్డు కేవలం సంఖ్యకే పరిమితం కాకుండా, భవిష్యత్ హరిత విప్లవానికి నాందిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.