AP Fire Department: రాష్ట్ర అగ్నిమాపక శాఖ (Fire Department) ఆధునీకత సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది. ఈ శాఖ తన విధానంలో త్వరలో డ్రోన్లు, రోబోలు వినియోగించుకుంటుంది. ప్రధానంగా బహుళ అంతస్తులు, ఎత్తైన భవనాలు, రసాయన పరిశ్రమలు వంటి వాటిలో ప్రమాదాలు జరిగినప్పుడు వీటిని వినియోగించనున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షలు చేపట్టి, పలు యూజ్ కేసులు సిద్ధం చేశారు. ఇకపై క్షేత్రస్తాయిలో పూర్తిగా వాడాలని నిర్ణయించారు.

AP Fire Department: మే నెలకల్లా అందుబాటులోకి కొత్త పరికరాలు
15వ ఆర్థిక సంఘం నిధులతో తొలుత 6 డ్రోన్లు, ఒక రోబో కొనుగోలు చేయనున్నారు. మే నెలకల్లా ఇవి అందుబాటులోకి వస్తాయి. వాటి పనితీరు ఆధారంగా రెండో దశలో మరిన్ని కొంటారు. ముఖ్యంగా మంటల వ్యాప్తిని గుర్తించి, అదుపు చేసేందుకు వీటిని వినియోగిస్తారు. డ్రోన్ల సహాయంతో అగ్ని ప్రమాద ప్రాంతం మొత్తాన్ని చిత్రీకరిస్తారు. మంటలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఎటువైపు వ్యాప్తి చెందుతున్నాయనేది అంచనా వేస్తారు. డ్రోన్ పంపించే దృశ్యాల ఆధారంగా అగ్నిమాపక బృందాలు రియల్టైమ్ ప్రణాళికను రూపొందించుకుని సహాయ చర్యలు చేపడతాయి. ఎత్తైన భవనాల్లో, పొగతో నిండిపోయిన భవనాల్లో మనుషులు చిక్కుకుపోయిన డ్రోన్లకు అమర్చిన థర్మల్ సెన్సర్ల సాయంతో వారిని గుర్తిస్తారు. ఎత్తైన, బహుళ అంతస్తుల భవనాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు డ్రోన్ల ద్వారా ఫైర్ సప్రెషన్ కెమికల్స్ చల్లి వాటిని అదుపు చేస్తారు.
ప్రమాదకర ప్రాంతాల్లో రోబోల వినియోగం
మంటల సమీపానికి సిబ్బంది వెళ్లేందుకు అవకాశం లేని, ప్రాణాపాయం అధికంగా ఉన్న సందర్భాల్లో రోబోలను వినియోగిస్తారు. వీటిని మంటల సమీపానికి రిమోట్ కంట్రోల్ ద్వారా పంపించి నీరు, ఫోమ్ వంటి వాటిని మంటలపై నేరుగా పిచికారీ చేయిస్తారు. ఈ రోబోలు అధిక ఉష్ణోగ్రతలు వేడిమిని తట్టుకుని పనిచేస్తాయి. ఫ్యాక్టరీలు, గ్యాస్ లీకేజీలు ఉన్న ప్రాంతాలు, భారీ పేలుళ్లు వంటివి చోటుచేసుకున్న సందర్భాల్లో వీటిని వాడతారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :