ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి వైసీపీ నేతలకు చట్టపరంగా ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పీఠం కోల్పోయిన తరువాత ప్రజల్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే యత్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో తాజాగా సత్తెనపల్లిలో జరిగిన ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ప్రధాన పాత్రధారిగా నిలిచారు.
జగన్ పర్యటన – ర్యాలీ ప్రణాళిక
జూన్ 18వ తేదీ బుధవారం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. వైసీపీ అధినేతకు మద్దతుగా నేతలు, కార్యకర్తలు వాహనాల ర్యాలీ చేపట్టారు.
ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన
జగన్ కాన్వాయ్ వెనుక వస్తున్న వాహనాలను కొర్రపాడు శివారులోని పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు కొద్దిసేపు నిలిపివేశారు. గుంటూరు, నల్లపాడు, మేడికొండూరు మీదుగా పల్నాడు జిల్లా వరకు ర్యాలీ సాగింది. ఈ క్రమంలో కొర్రపాడు శివారులోని ఒక పెట్రోల్ బంకు వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. జగన్ కారుతో పాటు ముందున్న వాహనాలను వదిలి వెనకున్న వాహనాలను కొద్దిసేపు ఆపేశారు. రద్దీని నియంత్రించే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు.
పోలీసుల వివరణ ప్రకారం, ఏటుకూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వృద్ధుడు మరణించడంతో, ఇకపై ఏ పరిస్థితి తలెత్తకుండా ముందస్తుగా ట్రాఫిక్‌ను నియంత్రించాలన్న ఉద్దేశంతో వాహనాలు నిలిపివేసినట్టు చెప్పారు. అయితే అంబటి ఈ వివరణను తోసిపుచ్చారు. ఓ దశలో తన సోదరుడు మురళితో కలిసి రోడ్డుపై అడ్డుగా పెట్టిన బారికేడ్లు నెట్టేశారు. అడ్డుచెప్పిన పోలీసులపై నోరు పారేసుకుని వారిపైకి దూసుకెళ్లారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్ వివరాలు
అంబటి రాంబాబుపై భారత న్యాయసంహిత (BNS) కింద ఉన్న కింది సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. భారత న్యాయ సంహితలోని 188, 332, 353, 427 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈమేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది.
Read also: Yogandhra: విశాఖలో ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై వాకథాన్