విజయవాడ: అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కేవలం ప్రదర్శన మాత్రమే కాదని, ఇది రేపటి రాజధాని నగర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూపిస్తుందని మున్సిపల్ పరిపాలన మంత్రి నారాయణ అన్నారు. విజయవాడ(Vijayawada)లోని ఎ కన్వెన్షన్లో జరుగుతున్న అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్- 2025ను శుక్రవారం సందర్శించిన ఆయన అమరావతి మోడల్స్, ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేశారు. నారాయణ మాట్లాడుతూ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అనుమతుల ప్రక్రియ సులభతరం చేశామని, పెట్టుబడి దారులకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చామని తెలిపారు.
రియల్ ఎస్టేట్ అంటే భవనాలు కాదని, ఉపాధి కల్పిస్తుంది
రియల్ ఎస్టేట్ (Real estate)అంటే కేవలం భవనాలు కాదని, ఇది ఉపాధి కల్పిస్తుంది, ఆర్థిక వృద్ధికి ఊత మిస్తుంది. అభివృద్ధి దిశగా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది అని స్పష్టం చేశారు. మంత్రి నారాయణ ప్రత్యేకంగా ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన మాలక్ష్మీ గ్రూప్ స్టాలు ప్రారంభించారు. ఆయనతో పాటు సంస్థ సీఈవో సందీప్ మండవ ఉన్నారు. అంతకు ముందు ఉదయం ఈ ప్రాపర్టీ ఫెస్టివల్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దీపప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ, సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారికి ఈ ప్రాపర్టీ షో గొప్ప వేదిక కానుందన్నారు. ఒకే చోట ఇందరు బిల్డర్స్, డెవలపర్స్, బ్యాంకులు రావడం అరుదైన విషయ మన్నారు. అమరావతి రూపుదిద్దుకుంటున్న దిశలో ఈ ప్రదర్శన ఒక పెద్ద మైలురాయి అవుతుందని తెలిపారు. అమరావతి త్వరలోనే దేశంలోనే అందమైన నగరంగా నిలుస్తుందని ఇక్కడ పెట్టుబడి పెట్టే వారికి మంచి భవిష్యత్ ఉంటుందని వివరించారు. నారెడ్కో అధ్యక్షుడు గద్దె చక్రధర్ మాట్లాడుతూ, అమరావతి దిశగా ఇది మైలురాయి అని అన్నారు. సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనేక రంగాలకు ఊతమిస్తుందని చెప్పారు. ఫెస్టివల్ చైర్మన్ కిరణ్ పరుచూరి మాట్లాడుతూ, 100కి పైగా బిల్డర్స్, డెవలపర్స్, ఫైనాన్స్ సంస్థలు పాల్గొనడం ప్రత్యేకత అని చెప్పారు. ఈ ఫెస్టివల్లో ప్రభుత్వ కాంప్లెక్సులు, రోడ్లు, బ్రిడ్జిలు, భవిష్యత్ ప్రాజెక్టుల మినియేచర్ మోడల్స్ ఆకర్షణగా నిలిచాయి. ప్రజలు అమరావతి మాస్టర్ ప్లానన్ను దగ్గరగా చూసే అవకాశం పొందుతున్నారు. నేరెడ్కో సెంట్రల్ జోన్ కార్యదర్శి ఎస్.వి. రామణ, ఖజానాదారు పి.వి. కృష్ణ, వంశీ వాసిరెడ్డి, కోడే జగన్, హరిప్రసాద్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: