Amit Shah: హిందీ ఏ భాషకూ పోటీ కాదు : అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాషల మధ్య విభేదాలకు తావులేదని స్పష్టం చేశారు. హిందీ భాష ఏ భాషకూ పోటీ కాదని, ఇది అన్ని భాషలకూ సోదర భాష అని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు భాషా వివాదాన్ని కావాలని రాజకీయం చేస్తున్నాయంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు భాష అంశాన్ని ప్రయోజనాత్మకంగా ఉపయోగించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

భాష పేరుతో దేశాన్ని విడదీయలేరు
రాజ్యసభలో ప్రసంగించిన అమిత్ షా, భాష పేరుతో ఇప్పటికే దేశం అనేక విభజనలను చూశిందని, ఇకపై అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చూస్తామని స్పష్టం చేశారు.భాషల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు తామెప్పుడూ సహకరించబోమని ఆయన తేల్చిచెప్పారు.భారతదేశంలోని అన్ని భాషలు సమానమే,ఇవన్నీ మన దేశ సంస్కృతికి ఒక గొప్ప ఆస్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.ప్రతి భాషకూ ప్రత్యేకత ఉంది,కానీ దేశాన్ని విడగొట్టేందుకు భాషను హింసాత్మక అంశంగా మారుస్తున్న రాజకీయ నాయకుల పద్ధతి సరైనదికాదని అన్నారు.
భాషాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి
భాషా పరంగా దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని కేంద్రం కృషి చేస్తోందని అమిత్ షా వివరించారు.మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘రాజ్యభాషా విభాగాన్ని’ ఏర్పాటు చేసిందని, ఈ విభాగం తెలుగు, తమిళం, పంజాబీ, అస్సామీ వంటి భాషలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.కొన్ని పార్టీలు దక్షిణాది భాషలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తప్పుదోవ పట్టిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు.అలా అయితే నేను గుజరాతీ అయినా కేంద్రంలో మంత్రిగా ఎలా ఉంటాను నిర్మలా సీతారామన్ తమిళనాడుకు చెందినవారు.మేమిద్దరం ఎలా పనిచేస్తున్నాం అంటూ ప్రశ్నించారు. తమిళనాడు ప్రభుత్వంపై కూడా అమిత్ షా విమర్శలు గుప్పించారు.ఇంజినీరింగ్ మెడికల్ విద్యను తమిళ భాషలో అందించాలని గత రెండేళ్లుగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నాం.కానీ ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు అని అసహనం వ్యక్తం చేశారు.భాషా వివాదాలు సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలనే తప్పుడు ప్రయత్నాలను ప్రజలు గుర్తించాలన్నారు.దేశంలోని ప్రతి భాష విలువైనదే అని, భాష పేరుతో భేదాభిప్రాయాలు సృష్టించకూడదని అమిత్ షా పిలుపునిచ్చారు.