దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన అనిల్ అంబానీకి చెందిన పలు స్టాక్స్ గతంలో రికార్డు స్థాయిలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అంబానీ అప్పుల్లో కూరుకుపోవడంతో పలు స్టాక్స్ కనిష్టాలకు దిగొచ్చాయి. అయితే ఇటీవల అప్పుల్ని తీరుస్తూ తన వ్యాపారాల్ని లాభాల బాట పట్టిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో షేర్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. కొన్నేళ్ల కిందట మన దేశంలో అత్యంత ధనవంతుల లిస్టులో ప్రస్తుత కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కంటే ముందువరుసలోనే ఉండేవారు ఆయన సోదరుడు రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ. ఆయన గ్రూప్‌కు చెందిన పలు స్టాక్స్ భారీగా పెరగడంతో అప్పట్లో అంబానీ సంపద భారీగా పెరిగేందుకు దోహదం చేసింది.

అయితే ఈ క్రమంలోనే తన వ్యాపారాల్ని వేగంగా విస్తరించడం విస్తృతంగా పెట్టుబడులు పెట్టిన కారణంగా అనిల్ అంబానీకి ఎదురుదెబ్బ తగిలింది. తీసుకున్న రుణాలు ఎక్కువైపోయాయి. వాటిని తీర్చలేక అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. దీంతో ఆయనకు చెందిన పలు కంపెనీల స్టాక్స్ కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఒక దశలో తన సంపద సున్నాకు పడిపోయిందని దివాలా తీసినట్లు అనిల్ అంబానీనే స్వయంగా చెప్పడం గమనార్హం. ఇది ఒకప్పటి పరిస్థితి చాలా రోజులు ఈయన పేరు పెద్దగా వినిపించలేదు. గత కొంత కాలంగా తిరిగి అనిల్ అంబానీ దూకుడు పెంచారు. ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. మళ్లీ తన కంపెనీల్ని విజయాల బాటలో నడిపించేందుకు శ్రమిస్తున్నారు. ఇక ఇటీవల రిలయన్స్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాల్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారీ నష్టాల నుంచి తేరుకొని లాభాలు నమోదు చేయడం విశేషం. అంతకుముందు ఆర్థిక సంవత్సరం
Stocks:
క్యూ 3లో సంస్థకు రూ. 1136.75 కోట్ల నష్టం రాగా ఇప్పుడు రూ. 41.95 కోట్లు లాభాలు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రుణ విముక్తి చెందినట్లు కూడా ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది. దీంతో స్టాక్ కూడా పుంజుకుంటోంది. ప్రస్తుతం రిలయన్స్ పవర్ స్టాక్ రూ. 41.72 వద్ద ఉంది. ఇలా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టడంతోనే స్టాక్ దూసుకెళ్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత రెండు వారాల్లో చూస్తే ఈ స్టాక్ ధర రూ. 36.71 నుంచి రూ. 41.72 స్థాయికి పెరిగింది. ఈ క్రమంలోనే 13 శాతానికిపైగా పుంజుకుంది. మంచి ఫలితాల నేపథ్యంలో పలు బ్రోకరేజీలు టార్గెట్ ప్రైస్ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే దీంట్లో ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తిచూపిస్తున్నారు. ఇక కంపెనీ మార్కెట్ విలువ రూ. 16.79 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 53.64 కాగా కనిష్ట విలువ రూ. 19.40 గా ఉంది.