ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య నియామకాల ప్రక్రియకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కీలక ముందడుగు పడింది. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు చేరింది. గతంలో ఈ నియామకాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ అధికారులు కారుణ్య నియామకాల ఫైల్‌ను ఆర్థికశాఖకు పంపగా, ఆ తర్వాత ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే 1,488 మంది పంచాయతీరాజ్ ఉద్యోగుల కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. కరోనా మహమ్మారిలో రాష్ట్రవ్యాప్తంగా 2,917 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో.. 1,944 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, 330 మంది కలెక్టర్ పరిధిలో ఉన్నవారు ఉన్నారు. 83 మంది యూనివర్సిటీ ఉద్యోగులు, 560 మంది కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులు, ఈ ఉద్యోగులలో 2,744 మంది కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకోగా, 1,149 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. బాధిత కుటుంబాలు పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. వెంటనే పవన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఫైల్ సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపింది, అక్కడి నుంచి ముఖ్యమంత్రి వద్దకు చేరింది. సీఎం ఆమోదముద్రతో కారుణ్య నియామకాల ప్రక్రియ ముగియనుంది. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలిగించనుంది.