దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదాని ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు జీత్ అదాని పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన దివా జైమిన్ షాను వివాహం చేసుకోనున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన వజ్రాల వ్యాపారి జైమిన్ షా.. కుమార్తె దివా. ఆయన- సీ దినేష్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌కు అధినేత. 2023లో జీత్ అదాని- దివా జైమిన్ షా ఎంగేజ్‌మెంట్ జరిగింది. దాదాపుగా రెండు సంవత్సరాల తరువాత వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతోన్నారు. ఫిబ్రవరి 7వ తేదీన అంగరంగ వైభవంగా వివాహ వేడుకలను నిర్వహించడానికి రెండు కుటుంబాల వారు ఏర్పాట్లు చేస్తోన్నారు.
గౌతమ్ అదాని- ప్రీతి అదానీల చిన్న కుమారుడు జీత్. ప్రస్తుతం అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2019లో అదానీ గ్రూప్ సంస్థల్లో చేరారు. సీఎఫ్ఓగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. అదానీ డిజిటల్ ల్యాబ్స్‌నూ ఆయనే పర్యవేక్షిస్తున్నారు.